Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో..
ఇండ్ల స్థలాల కోసం తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ-జనగామ
పేదలకు ఇండ్ల స్థలాలు పంచి, వాటికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. మండలంలోని పటేల్ గూడెం, నెల్లుట్ల, కుందారం, నవాపేట, వడిచర్ల గ్రామాలకు చెందిన ఇండ్లు లేని నిరుపేదలు వందలాదిగా తరలించి మండల కేంద్రంలోని చౌరస్తా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట బైటాయించి ధర్నా నిర్వహించారు. మండలంలోని నెల్లుట్ల - పటేల్ గూడెం గ్రామ శివారులో ఉన్న 7 ఎకరాల ప్రభుత్వ భూమిలో తమకు ఇండ్ల స్థలాలు, పట్టాలిచ్చి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాదు, పేదలకు ఇండ్ల స్థలాల కోసం భూమిని కేటాయించాలని బిష్మించుకూర్చున్నారు. పరిస్థితి అదుపుతప్పడంతో రెవెన్యూ అధికారులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసు బలగాలను మోహరించారు.
ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఏదునూరి వెంకట్రాజ్యం మాట్లాడుతూ.. రియాల్టర్ల చేతిలో నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న నెల్లుట్ల గ్రామ శివారు 464 సర్వే నెంబర్లోని ఏడెకరాల భూమిని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో ఇండ్లు లేని నిరుపేదలు ఎందరో ఉన్నారని, వారికి ఇండ్ల స్థలాల పట్టాలిచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. లేకుంటే సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇంటి స్థలాలు లేని పేదల విషయంలో అటు ప్రభుత్వం, ఇటు రెవెన్యూ అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీని వల్లనే పేదల సొంతింటి కల నెరవేరడం లేదన్నారు. జిల్లాలో వందల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు ధనికులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ పలుకుబడి కలిగిన నేతలు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. ఆక్రమణదారుల విషయంలో ఒక రకంగా, పేదల విషయంలో మరొక రకంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చేస్తున్న పోరాటం మీద నిర్బంధాలు, అణచివేత ప్రయోగిస్తే ప్రజలు తప్పకుండా ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం పట్టా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సింగారపు రమేష్, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లెర్ల లలిత మాట్లాడుతూ.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని నిర్బంధాలు ప్రయోగించిన పేదల తరపున చేస్తున్న ఈ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పలు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు తోటి దేవదానం, వ్యకాస జిల్లా నాయకులు పోతుకనూరి ఉపేందర్, గంగాపురం మహేందర్, రైతు సంఘం జిల్లా నాయకులు బొడ్డు కరుణాకర్, గడ్డం యాదగిరి, తదితరులతోపాటు పేదలు పాల్గొన్నారు.