Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ మొత్తంలో నగలు, నగదు స్వాధీనం
- ఇంకా లెక్క తేలని కోట్ల రూపాయాల భూముల కొనుగోలు వ్యవహారాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖాధికారులు నాలుగో రోజూ సోదాలు కొనసాగించారు. కోట్ల రూపాయల్లో ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై వంశీరామ్ బిల్డర్స్ యాజమాన్యం ఇండ్లతో పాటు వారి కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నాలుగో రోజు సోదాల్లో వంశీరామ్ బిల్డర్స్ చైర్మెన్ సుబ్బారెడ్డితో పాటు మరికొందరు బంధువులకు చెందిన బ్యాంకు లాకర్లను తెరిచిన అధికారులు అందులో పెద్ద ఎత్తున నగలతో పాటు వజ్రాలు ఉండటాన్ని గమనించారు. దీంతో వాటి లెక్క తేల్చటానికి స్వాధీనపర్చుకున్న అధికారులు వాటి విలువ కోట్లలో ఉంటుందని అనుమానిస్తున్నట్టు తెలిసింది. అలాగే, బ్యాంకులతో పాటు యాజమాన్యం ఇండ్ల నుంచి కోట్ల రూపాయల నగదును కూడా ఐటీ అధికారులు స్వాధీనపర్చుకున్నారని సమాచారం. ఇదిలా ఉంటే, భారీ ఎత్తున భూముల కొనుగోళ్లను కూడా సాగించినట్టు కనిపెట్టిన అధికారులు వాటి విలువ కూడా కోట్లాది రూపాయల్లోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, భారీ ఎత్తున భూముల కొనుగోళ్లకు సంబంధించి తమకు లభించిన పత్రాలకు, వంశీరామ్ యాజమాన్యం చెప్తున్న వివరాలకు ఎక్కడా పొంతన కుదరటం లేదని తెలుస్తున్నది. దీనిపై పూర్తి వివరాలను సేకరించే పనిలో నిమగమైన అధికారులు వాటి వివరాలను పూర్తిగా రాబట్టేంత వరకు సోదాలను కొనసాగించే అవకాశమున్నదని తెలిసింది.