Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటిసారి ఈవెంట్‌తో ప్రపంచ స్థాయి దృష్టి
- భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించిన సీపీ సీవీ ఆనంద్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ వేదికగా మొట్టమొదటి సారి ఫార్ములా ఈ- రేస్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీఎల్ ఆటోమొబైల్ (ఎఫ్ఐఏ), తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించనుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 11న హుస్సేన్‌సాగర్ చుట్టూ కొనసాగనున్న ఈ రేస్‌కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 నుంచి 35వేల మంది హాజరయ్యే అవకాశం ఉండటంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. అలాగే, ఈ రేసు సన్నద్ధతలో భాగంగా శని, ఆదివారాల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ చివరి సిరీస్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రెండ్రోజులు ట్యాంక్‌బండ్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.ఇదిలా ఉండగా, శుక్రవారం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్లో రేస్ నిర్వాహకులతో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమావేశమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు బ్లూప్రింట్‌పై చర్చించారు. ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీలు, భద్రత ఏర్పాట్లపై పలు సూచనలు, సలహాలను తీసుకున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తోపాటు ప్రత్యేక బలగాలు, ఏజెన్సీల సిబ్బందిని రంగంలోకి దించనున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలతోపాటు 2.8 కిలోమీటర్ల సర్క్యూట్ ట్రాక్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ ఈవెంట్ కావడంతో రేసర్లు, సహాయక సిబ్బంది కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే విధంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. వైద్య బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు మొదలైన వాటిపై సైతం సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మొదటిసారి రేస్ నిర్వహిస్తుండటంతో ఎంతో ఉత్కంఠ నెలకొందని తెలిపారు. ప్రజల భద్రత అత్యంత కీలకమని, మరిన్ని ప్రవేశ, నిష్క్రమణ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. టికెట్ల విక్రయాల నుంచి ఈవెంట్ పూర్తయ్యే వరకు అన్ని అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో అదనపు సీపీలు విక్రంసింగ్ మెన్నన్, ఏ.ఆర్.శ్రీనివాస్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్.రెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు, ఈవెంట్ నిర్వాహకులు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.