Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెడికల్ కళాశాల అల్యూమిని అసోసియేషన్ డిమాండ్
- ఆస్పత్రి నుంచి మెడికల్ కళాశాల వరకు భారీ నిరసన ర్యాలీ
నవతెలంగాణ - ధూల్‌పేట్
ఉస్మానియా ఆస్పత్రి కొత్త బిల్డింగ్‌ను వెంటనే కట్టాలని ఉస్మానియా మెడికల్ కళాశాల అల్యూమిని అసోసియేషన్ సభ్యులు, వైద్యుల అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఉస్మానియా మెడికల్ కళాశాల అల్యూమినియం అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మెడికల్ విద్యార్థులు, ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు సూపరింటెండెంట్ కార్యాలయం నుంచి మెడికల్ కళాశాల వరకు నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అఫ్జల్‌గంజ్, ఫీల్ కాన, సిద్ధి అంబర్ బజార్, ఉస్మాన్ గంజ్ మీదుగా సాగింది. ఈ సందర్భంగా వైద్యుల అసోసియేషన్ సంఘం నాయకులు డాక్టర్ బొంగు రమేష్ మాట్లాడుతూ.. ఆస్పత్రికి కొత్త భవనం వెంటనే నిర్మించాలని కోరారు. భవనం శిథిలావస్థకు చేరిందని, ఆస్పత్రికి పెరుగుతున్న రోగుల తాకిడితో ఉన్నటువంటి భవనంలోనే వసతులను సమకూర్చుకోవడం, వైద్య సేవలు అందించడంతో ఇబ్బందిగా ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. ఎనిమిదేండ్లుగా ప్రభుత్వం కొత్త బిల్డింగ్ కట్టిస్తామని చెబుతోందని తప్ప పనులు ప్రారంభించలేదని రిటైర్డ్ వైద్య బృందం ఆరోపించింది. ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ధనలక్ష్మి మాట్లాడుతూ.. ఆసియాలోనే అతిపెద్ద ఆస్పత్రి అయిన ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం వెంటనే నిర్మించాలన్నారు. ప్రభుత్వం, కోర్టు స్పందించి కొత్త బిల్డింగ్ నిర్మించి పూర్వవైభవాన్ని తీసుకురావాలని కోరారు. ఎన్ఎంసీ నిబంధన ప్రకారం సర్వీస్ సౌకర్యాలను మరింతగా మెరుగుపరచాలన్నారు. ప్రస్తుతం ఉన్న బిల్డింగ్‌లోనే రోగులను సమకూర్చడంతో బెడ్లు సరిపోక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ విషయంపై ఇంటెక్ కన్వీనర్ అనురాధ స్పందిస్తూ.. ఉస్మానియా ఆస్పత్రి పాత బిల్డింగ్‌ను పునరుద్ధరించి ఖాళీ స్థలంలో కొత్త బిల్డింగ్ కట్టాలని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ ర్యాలీలో మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులు, జూనియర్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.