Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడీకి కుల నిర్మూలన వేదిక ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఫీజులు, డొనేషన్లు అధికంగా వసూలు చేసిన ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కుల నిర్మూలన వేదిక (కెఎన్వీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ) అడిషనల్ డైరెక్టర్‌కు కెఎన్వీ అధ్యక్ష, కార్యదర్శులు పాపని నాగరాజు, కోట ఆనంద్ ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. గతంలో తెలంగాణ బహుజన విద్యార్థి సంఘం (టీబీఎస్ యూ) పేరుతో ఉన్నత విద్యామండలికి, సీబీఐకి కూడా ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా అధికంగా వసూలు చేస్తున్నా ఫీజు రెగ్యులరేటరీ కమిటీ నామమాత్రంగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ జేఎన్టీయూ సైతం ఈ కాలేజీలను పర్యవేక్షించడం లేదని పేర్కొన్నారు. యాజమాన్య కోటాలో ప్రతిభ అనేదే లేదనీ, ఎవరూ ఎక్కువ ఫీజులు చెల్లిస్తే వారికే సీటు కేటాయిస్తున్నారని తెలిపారు. ఆయా కాలేజీలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలనీ, వాటిలో చేరిన విద్యార్థుల సర్టిఫికేట్లను పరిశీలించాలనీ, తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.