Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లుగీత కార్మిక సంఘం సావనీర్ ఆవిష్కరణలో చెరుపల్లి
- 65 ఏండ్ల ఉద్యమ ప్రయాణంలో ఎన్నో కష్టాలు.. నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే..పోరాటమే మార్గమని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు ఎంవీ రమణ అధ్యక్షతన ఆ సంఘం '65ఏండ్ల ఉద్యమ ప్రయాణం' కార్యక్రమాన్ని నిర్వహించారు. భాగంగా చెరుపల్లితో పాటు కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మెన్ బాలగోని బాలరాజు గౌడ్ తదితరులు ఈ సందర్భంగా సావనీర్‌ను అవిష్కరించారు. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ పాలకులు వృత్తి పట్ల నిర్లక్షంగా వ్యవహరించినప్పుడు కార్మికులు సంఘటితంగా కొట్లాడి ఎన్నో విజయాలు సాదించుకున్నారని గుర్తుచేశారు. 65 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంలో ఆ విజయాలు లిఖించబడ్డాయన్నారు. ఆ పోరాటాల స్ఫూర్తితో వృత్తి రక్షణ, సంక్షేమం కోసం ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎంవీ రమణ మాట్లాడుతూ కల్లు గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించడంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోనూ,ఆ తర్వాత తెలంగాణలోనూ ఎన్నో పోరాటాలు నిర్వహించామని తెలిపారు. 1957 సంవత్సరంలో గార్ల పట్టణంలో మొదటి మహా సభ నిర్వహించుకుని ఎస్ఆర్ దాట్ల అధ్యక్షునిగా, బొమ్మగాని ధర్మ బిక్షం కార్యదర్శిగా ఆ నాటి సభ ఎన్నుకున్నదని గుర్తుచేశారు. సంఘం ఏర్పడి నేటికీ 65 వసంతాలు పూర్తి చేసుకుందని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 50 ఏండ్లుపై బడిన గీత కార్మికులకు వృత్తి పింఛన్,10 ఏండ్ల లైసెన్స్ పొడిగింపు,ఎక్స్ గ్రేషియా పెంపు ఇలా అనేక సమస్యలను రాజకీయ పార్టీల కతీతంగా పోరాడి సాధించుకున్నామన్నారు. బాలగోని బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రం లో సామాజిక న్యాయం అమలు చేయాలనీ, గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సభ ప్రారంభానికి ముందుగా సంఘం జెండాను మాజీ రాష్ట్ర కార్యదర్శి బీమగోని చంద్రయ్య ఎగరేయగా, సీనియర్ నాయకులు స్వాతంత్య్ర సమరయోధులు అబ్బ గాని బిక్షం కేక్ కట్ చేశారు. నూతన రాష్ట్ర కమిటీ సభ్యులతో మాజీ రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు ప్రతిజ్ఞ చేయించారు. సంఘంలో పనిచేసి అమరులైన వారి కుటుంబాలకు సన్మానం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎలుగూరి గోవిందు, గౌనీ వెంకన్న, వి.వెంకట నర్సయ్య, బోలగాని జయరాములు, చౌగాని సీతారాములు, ఎస్. రమేష్ గౌడ్, బూడిద గోపి, బాల్నేవెంకట మల్లయ్య, గాలి అంజయ్య నడిమింటి ఆశన్న గౌడ్, కొండ వెంకన్న ,బొడ పట్లసుదర్శన్ తదితర రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.