Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యపోరాటాలతోనే అందరికీ విద్య... అందరికీ ఉపాధి
- గవర్నర్ల ద్వారా ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు
- రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రలు : మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కె చంద్రు
- ఓయూలో ఘనంగా ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశసమైక్యత కోసం ఉద్యమించాలని మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ కె చంద్రు విద్యార్థులకు పిలుపునిచ్చారు. మతోన్మాద శక్తులను అడ్డుకట్టవేస్తేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇందుకోసం విద్యార్థులు ఐక్యం కావాలని కోరారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) అఖిల భారత 17వ మహా సభలు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వ విద్యాల యం (ఓయూ)లో ఉన్న ఠాగూర్ ఆడి టోరియంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎస్ఎఫ్ఐ జెండాను ఆ సంఘం జాతీయ అధ్యక్షులు విపి సాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరు ల స్తూపానికి నాయకులు పూలమాలవేసి నివాళుల ర్పించారు. ఆ తర్వాత ప్రతినిధుల సభనుద్దేశించి జస్టిస్ చంద్రు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ తొలి మహా సభలో తాను ప్రతినిధిగా ఉన్నానని గుర్తు చేశారు. ఆ సంఘం ఆవిర్భవించినపుడు అందరికీ విద్య అందరికీ ఉపాధి లక్ష్యంగా ఉండేదన్నారు. 52 ఏండ్ల తర్వాత ఆ లక్ష్యాలతోపాటు అందరూ ఐక్యం కావాలని చెప్పడం ముఖ్యమని అన్నారు. ఐక్య పోరాటాలతోనే అందరికీ విద్య అందరికీ ఉపాధి అవకాశాలు లభిస్తా యని చెప్పారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించి నపుడు నిర్బంధం ఉండేదనీ, అణచివేత, ప్రతిపక్ష నాయకుల అరెస్టులు కొన సాగాయని వివరించారు. ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదనీ, ప్రశ్నిస్తే జైళ్లలో వేస్తున్నారని విమర్శించారు. బాబ్రీ మసీదును కూల్చినపుడు యూపీలో కళ్యాణ్‌సింగ్ సీఎంగా ఉన్నారని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఆయన రోజూ కోర్టుకు హాజరయ్యేవారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆయనకు పద్మశ్రీ ఇచ్చా రనీ, రామమందిరం కోసం రథయాత్ర చేసిన అద్వానీకి భారతరత్న ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదని వ్యాఖ్యానించారు. నవరత్నాలను, ప్రభుత్వ రంగ సంస్థలను, సంపదను అంబానీ, అదానీకి మోడీ ప్రభుత్వం కట్టబెడుతున్నదని విమర్శించారు. అందరి కీ విద్య ఉపాధి గురించి కాకుండా రామ జన్మభూమి గురించి చర్చ జరుగుతున్నదని ఆందో ళన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీ కరణకు కేరళ ప్రభుత్వం వ్యతిరేకమని చెప్పారు. అయినా సుప్రీంకోర్టుకు వెళ్లి తిరువనంతపురం ఎయిర్‌పోర్టును అదానీ దక్కించుకున్నారని వివరిం చారు. న్యాయ వ్యవస్థ మోడీ-షాకు సహకరిస్తు న్నదని అన్నారు. సోషలిస్టు, సెక్యులర్, రిపబ్లిక్ అని రాజ్యాంగంలోని పీఠికలో ఉందన్నారు. ఇప్పుడు వాటిని సవరించేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తున్నదని విమర్శిం చారు. కేరళ, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రా ల్లో గవర్నర్ల పనివిధానాన్ని గమనిస్తున్నామనీ, ఆర్ఎస్ఎస్ ఎజెండాను వారు అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిపరచేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను పడగొడుతున్నారని అన్నారు. బీజేపీ యేతర ప్రభుత్వాలే లక్ష్యంగా గవర్నర్లు పనిచేస్తున్నా రని చెప్పారు. తమిళనాడు గవర్నర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎన్ రవి భగవద్గీత చదివితే ఫిజిక్స్ వస్తుందంటూ చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యలోకి మతాన్ని జొప్పించి కాషాయీ కరిస్తున్నారని చేస్తున్నా రని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల సవరణను, కార్మికకోడ్లను ఐఎల్వో అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. విద్యారంగం ఇప్పటికే ప్రయి వేటు పరమైందని వివరించారు. అందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలన్న రాజ్యాంగ స్ఫూర్తిని ప్రయివేటు యాజమాన్యాలు దెబ్బతీస్తున్నాయని అన్నారు. రాష్ట్రాల చేతుల్లో ఉండాల్సిన విద్యా రంగాన్ని కేంద్రం లాగేసుకుంటు న్నదని విమర్శిం చారు. మోడీ ప్రభుత్వం రెండు భారతదేశాలను నిర్మిస్తున్నదని వివరించారు. పేదల పిల్లలు సర్కారు బడులకు వెళ్తుంటే.. సంపన్నుల పిల్లలు కార్పొరేట్ స్కూళ్లకు వెళ్తున్నారని చెప్పారు. 1965కు ముందు అమెరికాలో నల్లజాతీయులకు, తెల్లవారికి వేర్వేరుగా బడులుండేవని గుర్తు చేశారు. అక్కడి సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కామన్ స్కూల్ విధానం అమల్లోకి వచ్చిందన్నారు. భారత దేశం లోనూ అందరికీ ఒకే స్కూల్ ఉండాలని డిమాండ్ చేశారు. ఒకే దేశం ఒకే మతం తరహాలో ఒకే ఆహారం వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే ఈ దేశాన్ని విడిచి పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలంటున్నారనీ, దేశద్రోహులుగా చిత్రీకరిస్తు న్నారని చెప్పారు. దేశ సమైక్యతను కాపాడుకోవాలనీ, రాజ్యాంగాన్ని పరిరక్షించాలనీ, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీ కరణ, పెట్టుబడుల ఉపసంహరణ, సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణతోపాటు అందరికీ విద్య, ఉపాధి కోసం ఐక్యంగా ఉద్య మించేలా ఈ మహాసభల్లో చర్చించాలని కోరారు. సామాజికవేత్త తీస్తా సెతల్వాద్ వీడియో సందేశాన్ని పంపించారు.
సాయుధ పోరాటం స్ఫూర్తిదాయకం : నర్సిరెడ్డి
భూమి కోసం, భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరా టం ఇప్పటికీ స్ఫూర్తిదాయకమని ఎస్ఎఫ్ఐ మహా సభల ఆహ్వానసంఘం అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగు బెల్లి నర్సిరెడ్డి అన్నారు. మల్లు స్వరాజ్యం పదేండ్ల వయస్సులోనే ఆ పోరాటంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. సాయుధ పోరాటంలో పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారనీ, మూడు వేల గ్రామా లు విముక్తి అయ్యాయని చెప్పారు. నాడు భూస్వాము లకు, పెత్తందార్లకు వ్యతిరేకంగా పేదలు పోరాటం చేశారని అన్నారు. కానీ దీన్ని మతపరంగా విభజించి హిందూముస్లింల మధ్య జరిగిన పోరాటంగా బీజేపీ విషప్రచారం చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ విద్యాసంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని చెప్పారు. నూతన జాతీయ విద్యావిధా నాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు విపి సాను అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్, ధీరజ్ తండ్రి రాజేంద్రన్, ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వా స్, గర్ల్స్ కన్వీనర్ దీప్సితా ధర్, కార్య దర్శివర్గ సభ్యు లు దీనిత్డెంటా, నితీష్ నారాయణ్, సచిన్‌దేవ్, వినీ ష్, మరియప్పన్, రాష్ట్ర అధ్యక్ష, కార్య దర్శులు ఆర్ఎల్ మూర్తి, టి నాగరాజు, ఏపీ అధ్యక్షులు ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.