Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నినాదాలతో హోరెత్తిన ఠాగూర్ ఆడిటోరియం
- ఎస్ఎఫ్ఐ జెండాను ఎగురవేసిన ఆ సంఘం అధ్యక్షులు వీపీ సానూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యార్థి ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం సాయంత్రం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) అఖిల భారత 17 మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మల్లుస్వరాజ్యం నగర్(ఠాగూర్ ఆడిటోరియం)లో అభిమన్యు-ధీరజ్-అనీశ్ఖాన్ మంచ్ దానికి వేదికైంది. విద్యార్థి ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ కేరళలో ప్రారంభించి ఆయా రాష్ట్రాల గుండా తెలంగాణకు తీసుకొచ్చిన ఎస్ఎఫ్ఐ జెండాను ఆ సంఘం జాతీయ అధ్యక్షులు వీపీ సానూ ఎగురవేశారు. రోమాలు నిక్కపొడిచేలా ప్రతినిధులు చేసిన నినాదాలతో అక్కడ ఉత్తేజపూరిత వాతావరణం నెలకొంది. అమరవీరుల స్తూపం వద్ద ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిస్వాస్, అధ్యక్షులు వీపీ సానూ, ఎస్ఎఫ్ఐ జాతీయ గర్ల్స్ కన్వీనర్ థీప్సితా ధర్, ఎమ్మెల్యే సచిన్దేవ్, జాతీయ నాయకులు దీనిత్ డెంటా, నితిస్ నారాయణ్, వినీష్, మరియప్పన్, జేఎన్యూ అధ్యక్షులు ఐషీ ఘోష్, బంగ్లాదేశ్ విద్యార్థినేత దీపక్ సింగ్, ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఆర్ఎల్ మూర్తి, నాగరాజు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రసన్న, అశోక్, తదితరులు నివాళులు అర్పించారు. ఠాగూరు ఆడిటోరియంలో 'మాకు ప్రేరణ' అని స్మరించుకుంటూ ఫెడల్కాస్ట్రో, చేగువేరా, పుచ్చలపల్లి సుందరయ్య, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిబాపూలే, పెరియార్, బిర్సాముండా, లక్ష్మిసెహగల్, రవీంద్రనాధ్ఠాగూర్, సుదీప్తోగుప్తా, మారడోనా, లక్ష్మినారాయణ, నర్సింహ్మ, రాజన్గోస్వామి, అభిమన్యు, రోహిత్ వేముల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. మహాసభల ప్రతినిధులు వాటిని ఆసక్తిగా తిలకిస్తూ మహనీయులు చరిత్రలను తెలుసుకుంటున్నారు. అక్కడ ఫొటోలు దిగుతూ కనిపించారు. ఠాగూర్ ఆడిటోరియం ఎదుట ఐ లవ్ ఎస్ఎఫ్ఐ సెల్ఫీస్పాట్ను ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాల ప్రతినిధులు గ్రూపుగా అక్కడ ఫొటోలు దిగటం కనిపించింది.