Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రామిక మహిళ రాష్ట్ర సదస్సులో పుణ్యవతి
- కార్మికోద్యమంలో మహిళలను భాగస్వాములు చేయాలి.. ఎం.సాయిబాబు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హింస అంటే కేవలం లైంగిక హింసే కాదనీ... పని కల్పించకపోవడం కూడా హింస కిందకే వస్తుందని శ్రామిక మహిళ సమన్వయ కమిటీ ఉమ్మడి రాష్ట్ర పూర్వ కన్వీనర్ ఎస్.పుణ్యవతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కో కన్వీనర్ పద్మశ్రీ అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర మూడో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును పుణ్యవతి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఏడేండ్ల కాలంలో శ్రామిక మహిళల పోరాటంలో పలువురు కొత్త వారు నాయకులుగా ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శ్రామిక మహిళలను సమీకరించేందుకు అవసరమైన క్షేత్రస్థాయి సమాచారాన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలు, ప్రాంతాల వారీగా సేకరించాలని సూచించారు. ఆ సేకరణ శ్రామిక మహిళలను సమీకరించి వారి హక్కుల కోసం పోరాడేందుకు ఉపయోగడుతుందని తెలిపారు. శ్రామిక మహిళలు రంగాలవారీగా సమావేశాలు నిర్వహించుకోవాలని కోరారు. శ్రామిక మహిళలు భయాన్ని వీడాలనీ, తమ సమస్యలను చర్చనీయాంశాలుగా మార్చాలని సూచించారు. ఇతర వేదికల కన్నా మహిళలు తమ సమస్యలను విపులంగా చర్చించేందుకు శ్రామిక మహిళా సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. మహిళలు, కార్మికులను అణగొదొక్కే పరిస్థితిలో మార్పు కోసం జరిగే ఉద్యమాల్లో తలెత్తి పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు మాట్లాడుతూ కార్మికోద్యమంలో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఏర్పాటైందని గుర్తుచేశారు. శ్రామిక మహిళ సాధించిన విజయాలతో పాటు అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా మున్ముందు కర్తవ్యాలపై చర్చించాలని సూచించారు. శ్రామిక మహిళలను సమీకరించేందుకు పని ప్రదేశాల వద్దకు వెళ్లాలని నాయకులను కోరారు. వస్త్రాలు, బంగారం దుకాణాలతో పాటు ప్రయివేటు ఆస్పత్రులు, థియేటర్లు తదితర ప్రదేశాల్లో శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ఉదహరించారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో శ్రామిక మహిళలను సమీకరించాలని సూచించారు. వారిని అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగస్వాములు చేయాలని కోరారు. శ్రామిక మహిళ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్.రమ నివేదికను ప్రవేశపెట్టారు. సీఐటీయూ అనుబంధ రంగాల వారీగా కమిటీలు వేసుకున్నామని తెలిపారు. కార్మికుల్లో, జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలను సమీకరించకుండా ఉద్యమ లక్ష్యాన్ని చేరుకోలేమని గుర్తించి ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై హింస పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగాన్ని ధ్వంసం చేసిన బీజేపీపై సంఘటిత పోరాటాలు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సిద్ధిపేట తదితర జిల్లాల్లో మహిళలపై దాడులు, లైంగిక దాడులు చోటు చేసుకున్న సందర్భాల్లో 'శ్రామిక మహిళ' న్యాయం కోసం పోరాటం చేసిందని గుర్తుచేశారు. ఒకవైపు రోజువారీ సమస్యలపై పోరాటం చేస్తూనే మరోవైపు ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఆశా, అంగన్ వాడీలు తదితరరంగాల వారీగా సర్వేలు నిర్వహించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈఎస్ఐ, పీఎఫ్ లాంటివి లేకుండా కార్మికులను కట్టుబానిసలుగా మారుస్తున్న విధానాలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. మహిళల రక్షణకు సంబంధించి పద్మశ్రీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సదస్సులో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌తో పాటు రాష్ట్ర నాయకులు, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.