Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
క్షౌరవృత్తిలోకి ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలు రాకుండా నిషేధించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 'కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సరళీకరణ ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేస్తూ ప్రభుత్వ సంస్థలతో పాటు, కుల వృత్తులను కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పుతున్నది. ఫలితంగా రానున్న కాలంలో ప్రభుత్వ సంస్థలతో పాటు, కులవృత్తులు కూడా కనుమరుగయ్యే ప్రమాదముంది. ఇందులో భాగంగానే క్షౌరవృత్తిలోకి కూడా కార్పొరేట్ సంస్థలను ఆహ్వానించింది. దీని వల్ల లక్షలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డునపడతాయి. కార్పొరేట్ వర్గాల కోర్కె మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడుతోంది. తెలంగాణవ్యాప్తంగా సుమారు మూడు లక్షల షాపుల్లో 10 లక్షల కుటుంబాలకు క్షౌరవృత్తి జీవనాధారంగా ఉన్నది. ఇప్పుడు ఈ వృత్తిలోకి రిలయన్స్, హార్బిన్ క్లబ్, స్ఫా, నేచరల్ సంస్థలు ప్రవేశించడంతో క్షౌరవృత్తిదారుల జీవితాలు చిన్నాభిన్న మవుతున్నాయి. ఇది చాలా ఆందోళ నకరం....' అని ఆయన పేర్కొన్నారు. ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న క్షౌర వృత్తిదారుల కుటుంబాలకే సొసైటీలను ఏర్పాటు చేసి, వాటికి నిధులు కేటాయించి అధునాతన మైన యంత్ర పరిక రాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని కోరారు. తద్వారా వారి ఉపాధి మెరుగుపర్చాలని తమ్మినేని డిమాండ్ చేశారు.