Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగన్వాడీలకు పెనుప్రమాదం
- నీట్‌తో పేద విద్యార్థులకు నష్టం
- నవతెలంగాణతో ఎస్ఎఫ్ఐ తమిళనాడు కార్యదర్శి నిరుబన్ చక్రవర్తి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (ఎన్ఈపీ)తో విద్యావ్యవస్థకు విఘాతం కలుగుతుందని తమిళనాడు ఎస్ఎఫ్ఐ కార్యదర్శి నిరుబన్ చక్రవర్తి అన్నారు. నూతన విద్యావిధానంతో తమిళనాడులో ప్రాథమిక విద్యలో కీలకమైన అంగన్వాడీలు పెను ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈనెల 13 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలకు హాజరైన నిరుబన్ చక్రవర్తి నవతెలంగాణ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు... తమిళనాడులో కమ్యూనిస్టు నాయకులు విద్యాభివృద్ధికి చేసిన కృషి, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు ఇస్తున్న ప్రాధాన్యంతో ప్రభుత్వ విద్యావ్యవస్థ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉంది. మా రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 174 ప్రభుత్వ కళాశాలలు, 3,054 ప్రభుత్వ హాస్టళ్లున్నాయి. అయితే విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇంకా జరగాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు 16 రకాల వస్తువులను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నది. ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకునే పాఠశాల స్థాయి విద్యార్థులకు రోజుకు రూ.32, కళాశాల విద్యార్థులకు రోజుకు రూ.37 మెస్ ఛార్జీల కింద ఆ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఉన్నతవిద్య అభ్యసించే విద్యార్ధుల సంఖ్య జాతీయ స్థాయిలో 26 శాతం ఉంటే తమిళనాడులో 51 శాతంగా నమోదైంది. నూతన జాతీయ విద్యా విధానం తమిళనాడు విద్యార్థులకు, అక్కడ విద్యావ్యస్థకు తీరని నష్టం కలగజేస్తుంది. అటువంటి నష్టాలను అంచనావేసిన తర్వాతే ఎన్ఈపీ వద్దంటూ ఎస్ఎఫ్ఐ పలు దఫాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్), సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూ ఈటీ)లకు వ్యతిరేకంగా తమిళనాడులో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాం. నీట్‌ను వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ రెండు సార్లు తీర్మానం చేసింది. దానివల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు ముఖ్యంగా పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. ఇంగ్లీష్ మాధ్యమంలో చదవని వారు నీట్లో ర్యాంకులు పొందే అవకాశం లేదు. అందుకే నీట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎన్ఈపీ, నీట్, సీయూఈటీని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది. యూనివర్సిటీల్లో ఛాన్సలర్లు అవసరం లేదంటూ ఏడు నెలల క్రితమే తమిళనాడు మంత్రివర్గం తీర్మానం చేసింది. ప్రస్తుత విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేసుకుంటూ నూతన విద్యావిధానాన్ని అడ్డుకోవడమే మా ముందున్న తక్షణ కర్తవ్యం.