Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాయుధ పోరాటాన్ని మత పోరాటంగా వక్రీకరిస్తున్న బీజేపీ
- రాష్ట్రాల పరిపాలన వ్యవహారాల్లో గవర్నర్ల పెత్తనం
- బీఆర్ఎస్ వైఖర్ని బట్టి నిర్ణయం : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
నవతెలంగాణ-రామన్నపేట
ప్రజావ్యతిరేక, మతతత్వ బీజేపీని ఎదుర్కోవాలంటే రాష్ట్రాల వారీగా రాజకీయ పార్టీల ఏకీకృతం తప్పదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బీజేపీకి చరిత్ర లేదని, కానీ ఆ పోరాటాన్ని మత పోరాటంగా వక్రీకరించేందుకు యత్నిస్తోందని విమర్శించారు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం పోరాటంగా బీజేపీ ప్రచారం చేయడంపై ఇంతకంటే అమానుషం మరొకటి లేదన్నారు. నిజాం అరాచక రాచరిక పాలనకు వ్యతిరేకంగా మొట్టమొదట ఉద్యమాన్ని నిర్వహించింది ముస్లిం యువకుడు బందగీ అని గుర్తు చేశారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో అత్యధికులు ముస్లిములే ఉన్నారని స్పష్టం చేశారు. బీజేపీ మతోన్మాద కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని విద్యావ్యవస్థను గుప్పెట్లోకి తీసుకోవాలని కేంద్రంలోని బీజేపీ యత్నిస్తుందని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సర్కారియా కమిషన్ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు.
బీజేపీ విధానాలపై ఆయా రాష్ట్రాల్లో గొంతెత్తే పార్టీలతో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల్లో ఉద్యమించే రాజకీయ పార్టీలతో సీపీఐ(ఎం) సర్దుబాటు ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్‌లో అంతర్గత తగాదాల వల్లే రాష్ట్రంలో బీజేపీని ఓడించే శక్తి కోల్పోతుందన్నారు. ఆ పార్టీ సమీక్షించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలు మినహా మిగతా అన్ని పార్టీలూ బీజేపీకి దాసోహమంటున్నాయని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బీజేపీకి సరెండర్ అయ్యా రన్నారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించడాన్ని స్వాగతించాల్సిన అంశమేకానీ బీజేపీకి వ్యతిరేకంగా నికరంగా పోరాడాలని హితవు పలికారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడులో బీజేపీ ప్రమాదాన్ని అరికట్టడం కోసమే మద్దతిచ్చాం కానీ బీఆర్ఎస్ విధా నాలను సమర్థిస్తూ కాదని తెలిపారు .దళితబంధు, ఇంటి నిర్మాణాలకు రూ.3 లక్షల విషయంలో రాజకీయ జోక్యం ఉండరాదని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింప జేయా లని కోరారు. దేశ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో వామ పక్షాలు విలక్షణ పాత్ర పోషించబోతు న్నాయని తెలి పారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతా రాములు, జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ తదితరులు ఉన్నారు.