Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్ శాతం పెంచకుండా కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రలు చేస్తున్నదని తెలంగాణ గిరిజన సంఘం (టీజీఎస్) విమర్శించింది. ఈ మేరకు బుధవారం టీజీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ధర్మనాయక్, ఆర్.శ్రీరాంనాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవో నెంబర్ 33ను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించకుండా రోజుకో గందరగోళ ప్రకటన చేస్తూ గిరిజనుల్లో అభద్రతా భావాన్ని పెంచే విధంగా వ్యవహరించడాన్ని వారు ఖండించారు. బీసీ-డీ రిజర్వేషన్ సమస్య పరిష్కారమయ్యేంత వరకు చట్టబద్ధత కల్పించలేమని కేంద్ర గిరిజన మంత్రి అర్జున్ ముండా చెప్పడం ఆయన దివాళా కోరుతనానికి నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్ శాతం పెంచడం బీజేపీకి మొదట్నుంచి ఇష్టం లేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసుకు, గిరిజన రిజర్వేషన్ల పెంపునకు ఎలాంటి సంబంధం లేదనీ, ఆ వర్గానికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కును అమలు చేయకుండా కోర్టు కేసుతో పదే పదే ముడిపెట్టి మాట్లాడటం రాజకీయ ప్రయోజనాలు ఆశించి లాభపడేందుకేనని విమర్శించారు. న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తూ రిజర్వేషన్ వ్యతిరేక శక్తులకు బీజేపీ సహాయ పడుతున్నదని పేర్కొన్నారు. అర్జున్ ముండా ప్రకటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గిరిజనులపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే రిజర్వేషన్ల పెంపు జీవోను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు మరో పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. గిరిజన సంఘాలు ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని కోరారు.