Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సుల్తాన్ బజార్
ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హైదరాబాద్‌లో ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 17, 18 తేదిల్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) అమిత్ జింగ్రాన్ వెల్లడించారు. కోటిలోని ఎస్బీఐ ఎల్హెచ్ఓ కార్యలయంలో ఎన్‌డబ్ల్యూ-1 జీఎం మంజూ శర్మ, సీసీజీఆర్ఓ జిఎం జి రమేష్‌తో కలిసి జింగ్రాన్ మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు సాగనున్న ఈ ప్రదర్శనలో 70 మంది పెద్ద బిల్డర్లు తమ 300 పైగా ప్రాపర్టీలను ప్రదర్శనకు ఉంచనున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని కొనుగోలుదారులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ ప్రాపర్టీ షోలో నివాసాలను కొనుగోలు చేసే వారికి రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును మినహాయించనున్నట్టు జింగ్రాన్ తెలిపారు. గృహ రుణాలపై వడ్డీ రేట్లు 8.40 శాతం నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఇతర బ్యాంక్‌లతో పోల్చితే తాము చౌక రుణాలను ఆఫర్ చేస్తున్నామన్నారు.
గృహ రుణాల విభాగంలో హైదరాబాద్ సర్కిల్ 25 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉందన్నారు. ఈ విభాగంలో తామే మార్కెట్ రారాజుగా ఉన్నామని జింగ్రాన్ వెల్లడించారు. దేశంలో ఎస్బిఐ రూ.6 లక్షల కోట్ల గృహ రుణాలను జారీ చేయగా.. తమ సర్కిల్ ఇందులో రూ.50వేల కోట్ల పైగా వాటా కలిగి ఉందన్నారు. ప్రస్తుత ఏడాదిలో బిల్డర్ రుణాల విభాగంలో రూ.220 కోట్ల రుణాలు జారీ చేశామన్నారు. మరో రూ.600 కోట్లు ప్రక్రియలో ఉన్నాయన్నారు. బిల్డర్లకు సంబంధించి 403 ప్రాజెక్టులతో ఒప్పందాలు ఉన్నాయన్నారు. ఈ పరిశ్రమలో ఎస్‌బిఐనే పోటీ వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.12,000 కోట్ల విలువ చేసే 21,714 గృహ, టాప్ అప్ రుణాలను జారీ చేశామన్నారు. ద్వితీయ శ్రేణీ పట్టణాల్లోనూ విస్తరణపై దృష్టి పెట్టామని.. ఇందుకోసం వచ్చే కొన్ని నెలల్లో 10 ప్రాసెసింగ్ సెల్‌లను తెరువనున్నామని తెలిపారు.