Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలో తీర్మానం
- మల్లు స్వరాజ్యం నగర్ నుంచి
నవతెలంగాణ ప్రతినిధి
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్వీర్యానికి వ్యతిరేకంగా పోరాడాలని ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభ తీర్మానించింది. హైదరాబాద్‌లో ఓయూలోని అభిమన్యు- ధీరజ్-అనీశ్ఖాన్ మంచ్‌లో ఎస్ఎఫ్ఐ నేత సుయేశ్ మాన్వయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 'కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (డీఎన్‌పీ) 2019లో పబ్లిక్ డొమైన్లో విడుదల చేసింది. దానిపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఎస్ఎఫ్ఐతో సహా ఇతర విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఎన్ఈపీని వ్యతిరేకిస్తున్నాయి. అది ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి దానికి వ్యతిరేకంగా క్రమం తప్పకుండా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్‌ను నిర్వీర్యం చేసి, దాని స్థానంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఇసీఐ)ని ఏర్పాటు చేయాలని ఎన్ఈపీలో ఉంది. ముసాయిదా ఎన్ఈపీ ఇంకా పనిలో ఉండగానే, ప్రభుత్వం 2018లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ను రద్దు చేసేందుకు ఒక బిల్లును సమర్పించింది. యూజీసీ అనేది విశ్వవిద్యాలయాలను నియంత్రించడానికి, నిధులు సమకూర్చడానికి దేశంలోని అత్యున్నత సంస్థ. ఈ బిల్లు ప్రకారం, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), యునైటెడ్ గ్రాంట్స్ కమీషన్ (యూజీసీ) రెండు విభిన్న నియంత్రణ సంస్థలు ఒక్కటిగా మార్చబడి హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఈసీఐ)గా మారబోతున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్ఈసీఐ బిల్లును ప్రవేశపెట్టనుంది. ప్రతిపాదిత హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్టం-2018 (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం, 1956 రద్దు) రాబోతున్నది. యూనివర్సిటీలకు నిధులను సమకూర్చడంలోనూ, వాటిలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చేయడంలోనూ యూజీసీ కీలక భూమిక పోషిస్తూ వస్తున్నది. హెచ్ఈసీ అలా కాదు.. ఆర్థిక విషయాలపై ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండదు. సంస్థలు స్వయంగా ఫైనాన్స్ నిర్వహించాలని ఆదేశిస్తుంది. దీనివల్ల యూనివర్సిటీలు నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉంది. పేదలకు ఉచితంగా ఉన్నత విద్య అందకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది. విద్యాసంస్థలకు సముచిత గ్రాంట్లను పంపిణీ నిర్ధారించడానికి స్వయం ప్రతిపత్తమైన యూజీసీని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాం. యూజీసీ నిర్వీర్యానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తాం' అని మాన్వయ ప్రతిపాదించారు. దీన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందించాలి
పాఠశాలల విద్యార్థుల డ్రాపౌట్స్‌ను తగ్గించడం, పిల్లలకు మెరుగైన విద్య, ఆరోగ్యాన్ని అందించడంలో మధ్యాహ్న భోజనం పథకం కీలక పాత్ర పోషిస్తున్నదనీ, దాన్ని నిర్వీర్యం చేయొద్దని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ మహాసభ తీర్మానం చేసింది. 'జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2015-2016) ప్రకారం 85 శాతం ప్రజలకు కోడిగుడ్డు తినడంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. పౌష్టికాహారం పిల్లలకు అందించడంలో కులమతాల భావజాలాల జోక్యం ఏ విధంగానూ ఉండరాదు. పౌష్టికాహార విషయంలో వీటి జోక్యం వల్ల పిల్లల ఎదుగుదలపై ప్రభావం పడుతున్నది. కోడిగుడ్లను ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలోనూ అందించాలి. అంగన్వాడీల్లోనూ అదనంగా పాలు, పెరుగు అందించాలి. గుడ్లు తినని వారికి అది ఉపయోగకరం. జాతీయ పౌష్టికాహార సంస్థ, మేధావులు, ఆహార నిపుణుల డిమాండ్ ప్రకారం..మధ్యాహ్న భోజన పథకంలో వారానికి ఐదు రోజులు గుడ్లు అందించాలి.
దీనివల్ల పిల్లలకు పౌష్టికాహారం అందుతుంది. కానీ, బీజేపీ 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే 14 రాష్ట్రాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లు అందించడం లేదు. ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కొందరు వ్యతిరేకిస్తున్నారనే పేరిట గుడ్డును ఆపేయడం సరిగాదు. అదేసమయంలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను ఎన్జీఓ సంస్థలకు అప్పగించడం కుట్రపూరితమే. ఉత్తరాఖండ్‌లో ఎవరైనా గుడ్లు వండి పెడితే ఆ మహిళలను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు మధ్యప్రదేశ్‌లో ఆదివాసీ ప్రాంతాల్లో గుడ్లను ఇవ్వడం మానేశారు. భారతదేశ ఆహార అలవాట్లను శాస్త్రీయంగా చూడకుండా అందులోనూ మతభావాలను జొప్పించడం సరిగాదు. మాంసాహారం తీసుకునే వారి అలవాట్లను నేరపూరితంగా చూస్తున్నారు. అందరి ఆహారపు అలవాట్లను గౌరవించాలి. రక్తహీనత నుంచి, పౌష్టికాహారం లోపం నుంచి పిల్లలు బయటపడేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత మెరుగ్గా అమలు పర్చాలి. నిధులను పెంచాలి. అంతిమంగా పిల్లలకు పౌష్టికాహారం అందేటట్టు చూడాలి' అని మహాసభ తీర్మానించింది.