Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సంఘాల పోరాట వేదిక, వ్యకాస ఆధ్వర్యంలో..
- 700 మంది ఇల్లు లేని నిరుపేదలు కలెక్టరేట్ ముట్టడి
- పరిశీలించి అర్హులందరికీ ఇండ్లస్థలాలు ఇస్తామన్న ఆర్డీవో
నవతెలంగాణ-జనగామ
ఇండ్లు లేని నిరుపేదలు తమకు ఇల్లు స్థలాల ఇచ్చేంత వరకూ ప్రజాసంఘాలు, సీపీఐ(ఎం) అండతో ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని నిరుపేదలు స్పష్టం చేశారు. జనగామ జిల్లాలోని లింగాల ఘన్పూర్ మండలం నెల్లుట్ల గ్రామ శివారులోని 7 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నెల్లూట్ల, పటేల్ గూడెం, చిన్న మడూర్, వడిచర్ల, రామరాజుపల్లి, సింగరాజుపల్లి, పెద్దమడూర్ 10 గ్రామాలతోపాటు జనగామ పట్టణంలోని ఆయా వార్డుల్లోని ఇల్లు లేని నిరుపేదలు ప్రజా సంఘాల పోరాట వేదిక, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. అంతకుముందు సూర్యాపేట రోడ్డుకు ఆనుకొని ఉన్న నెల్లూట్ల శివారు ప్రభుత్వ స్థలం నుంచి గ్రామం మీదుగా ఆర్టీసీ కాలనీ, జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా స్థానిక కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైటాయించిన నిరుపేదలు ఇండ్ల స్థలాలు కేటాయించేంతవరకు ఆందోళన విరమించమని భీష్మించుకు కూర్చున్నారు. దాంతో ఆ ప్రాంతమంతా సుమారు 3 గంటల పాటు నిరుపేదల నినాదాలతో మార్మోగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఏసీపీ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐలు శ్రీనివాస్, సంతోష్ కుమార్, నాగబాబులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర నాయకులు ఎండీ అబ్బాస్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ భూములను కాపాడటంలో భాగంగా నిరుపేదలు చేస్తున్న భూమి, ఇండ్లస్థలాల పోరాటం రాజ్యాంగ బద్ధమైన పోరాటమని స్పష్టం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం చేస్తున్న ఉద్యమాలకు సీపీఐ(ఎం) ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వాలు ప్రజలకు చేసిన వాగ్దానాలను మర్చిపోవడం మూలంగానే ప్రజలు ప్రత్యక్షంగా పోరాటంలోకి దిగుతున్నారన్నారు. ఇప్పటికే జిల్లాలో, రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని, మిగిలినటువంటి భూములనూ దక్కించుకోవడం కోసం పేదలు చేస్తున్న ఈ న్యాయమైన పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించి వారికి ఇండ్ల స్థలాలు, ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ధర్నా విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఆర్డీవో మధుమోహన్‌ను ధర్నా వద్దకు పంపించగా.. ఆయనకు పేదలు, నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. నెల్లుట్ల- పటేల్ గూడెం శివారులో పేదలడుగుతున్న భూమి ప్రభుత్వానిదేనని, అది పేదలకే చెందుతుందని ప్రజల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. అర్హులను పరిశీలించి నిబంధనల మేరకు ఆ స్థలాన్ని పేదల ఇండ్ల స్థలాలకు కేటాయిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగానికి సంఘం నాయకులు, పేదలు ధన్యవాదాలు తెలియజేశారు. సాధ్యమైనంత తొందరగా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ధర్నాలో వ్యకాస జిల్లా కార్యదర్శి ఏదునూరి వెంకట్రాజం, కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తోటి దేవదానం, బొట్ల శేఖర్, వ్యకాస నాయకులు గంగాపురం మహేందర్, వెన్నపూస కుమార్, పుతకనూరి ఉపేందర్, ప్రజా సంఘాల నాయకులు సాంబరాజు యాదగిరి, పొదల నాగరాజు, మునిగల రమేష్, బోడ నరేందర్, జోగు ప్రకాష్, పల్లేరుల లలిత,బొడ్డు కరుణాకర్, తదితరులతోపాటు భూ పోరాట కమిటీ నాయకులు, వందలాది మంది పేదలు పాల్గొన్నారు.