Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరికీ విద్య అందాలన్నదే మా ధ్యేయం
- హెచ్ఈసీఐ బిల్లును వెనక్కి తీసుకోవాలి
- మీడియా సమావేశంలో ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకులు
మల్లుస్వరాజ్యం నగర్(హైదరాబాద్) నుంచి నవతెలంగాణ ప్రతినిధి
దేశంలోని యూనివర్సిటీలు, అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ అఖిలభారత మహాసభల వేదికైన హైదరాబాద్‌లోని మల్లు స్వరాజ్యం నగర్ (ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియం)లో బుధవారం మీడియా సమావేశంలో ఆలిండియా ఉపాధ్యక్షులు థీప్సితాధర్, దీనిత్ డెంటా, జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు నితీశ్ నారాయణ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.నాగరాజు, ఆర్ఎల్.మూర్తి మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఒకే కామన్ ఎంట్రెన్స్‌లో భాగంగా తీసుకొచ్చిన నీట్, జేఈఈ, సీయూఈటీలను వ్యతిరేకిస్తున్నామని నొక్కి చెప్పారు. దీనివల్ల చాలా మంది పిల్లలు చనిపోతున్నారంటూ తమిళనాడు ఘటనలను ఉదహరించారు. కార్మికులు, రైతులు, పేదల పిల్లలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్ర దీని వెనుక దాగి ఉన్నదని విమర్శించారు. రాజస్థాన్‌లోని కోట అనే చిన్న ప్రాంతంతో నీట్ శిక్షణ పేరుతో కోచింగ్ సెంటర్ల మాఫియా బుసలు కొడు తున్నదన్నారు. లక్షలాది రూపాయలు పెట్టి పేదల పిల్లలు అక్కడ ఎలా శిక్షణ తీసుకోగలుగుతారని ప్రశ్నించారు. ముఖ్యంగా గ్రామీణ పిల్లలంతా స్థానిక భాషల్లో, ఉన్నత వర్గాల వారి పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువు తున్నారని చెప్పారు. పేద పిల్లలకు సీట్లు ఎలా వస్తాయన్నారు. 18 ఏండ్లకే విద్యార్థులు తమ ఓటు హక్కుతో ప్రధాని, సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకుంటున్నారనీ, అలాంటిది విద్యాసంస్థల్లో ప్రజాస్వామిక వాతావరణం ఎందుకు ఉండొద్దని ప్రశ్నించారు. ప్రభుత్వాల తీరు ఫ్యూడల్ వ్యవస్థను తలపించేలా ఉందని విమర్శించారు. విద్యార్థి సంఘాల ఎన్నికల ను నిర్వహించాలనే డిమాండ్‌తో తాము ముందుకు వెళ్లబోతున్నామని చెప్పారు. ప్రయివేటు యూనివర్సీటీలు, కళాశాలల్లోకి విద్యార్థి సంఘాలను అనుమతించకపోవడం దారుణమ న్నారు. స్కాలర్ షిప్పులు రాకపోయినా, సరైన తిండి పెట్టకపోయినా అక్కడి వెళ్తేనే విద్యార్థుల సమస్యలపై తాము పోరాడగలుగుతామన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల సూచనల మేరకే నూతన విద్యావిధానంలో ప్రయివేటు వర్సిటీలు, కళాశాల్లోకి అనుమతించొద్దనే నిబంధనను పొందుపర్చారని విమర్శించారు. పశ్చిమబెంగాల్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ఎన్ఈపీకి వ్యతిరేకంగా 20 రోజుల పాటు ఆందోళనలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. విద్యార్థులకు ప్రశ్నించే హక్కులేదా? అని నిలదీశారు. మోడీ హయాంలో దేశంలో విద్యావిధానంపైనే దాడి జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లుకు వ్యతిరేకంగా తమ మహాసభలో తీర్మానం చేశామనీ, కేంద్ర ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకునేదాకా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. మహాసభలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మరో తీర్మానం చేశామన్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాలు ముందుకొచ్చి యుద్ధానికి ముగింపు పలకాలని కోరారు. యుద్ధం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, ప్రజలు, సైనికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు.