Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంస్కృతిక, జాతీయవాదంపైనా కేంద్రీకరించాలి
- హక్కుల సాధనకు పోరాటమే మార్గం
- ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగమే ఎన్ఈపీ
- ప్రత్యామ్నాయ విద్యావిధానం అమలు చేస్తున్న కేరళ ప్రభుత్వం
- ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభల్లో మాజీ నేతల పిలుపు
నవతెలంగాణ బ్యూరో -
మల్లు స్వరాజ్యం నగర్ (హైదరాబాద్)
ఫాసిస్టు, మతతత్వ విధానాలు దేశానికి ప్రమాదకరమని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) అఖిల భారత మాజీ నాయకులు చెప్పారు. విద్యారంగంతోపాటు సాంస్కృతిక రంగం, జాతీయవాదంపైనా కేంద్రీకరించి పనిచేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడం కోసమే నూతన జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ)-2020ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని విమర్శించారు. విద్యార్థుల హక్కులు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటమే మార్గమని అన్నారు. ప్రత్యామ్నాయ విద్యావిధానాన్ని అమలు చేస్తున్న కేరళలోని వామపక్ష ప్రభుత్వం దేశానికి ఆదర్శనమని చెప్పారు. ఎస్ఎఫ్ఐ అఖిల భారత 17వ మహాసభలు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో ఉన్న ఠాగూర్ ఆడిటోరియంలో రెండోరోజు కొనసాగింది. అందులో భాగంగా బుధవారం ఎస్ఎఫ్ఐ అఖిల భారత మాజీ నాయకులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు సౌహార్ధ సందేశమిచ్చారు.
విద్యాకేంద్రీకరణతో ప్రమాదం : ఎంఏ బేబి
విద్యా కాషాయీకరణ, ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, వ్యాపారీకరణతోపాటు కేంద్రీకరణ ప్రమాదకరమని ఎస్ఎఫ్ఐ అఖిల భారత మాజీ అధ్యక్షులు ఎంఏ బేబి ఆందోళన వ్యక్తం చేశారు. ఫాసిస్టు, మతతత్వ విధానాలను ఎన్ఈపీ ద్వారా మోడీ ప్రభుత్వం విద్యారంగంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఇందులో ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక ఎజెండా ఉందన్నారు. విద్యార్థులు, యువకులే లక్ష్యంగా ప్రగతిశీల, అభ్యుదయ భావాలు, శాస్త్రీయ విద్యను అందించకుండా వారి మేధస్సు సృజనాత్మకంగా ఆలోచించకుండా చేస్తునాన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ జయంతికి చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులు కృష్ణుడిలా తయారు చేస్తున్నారని వివరించారు. అయితే వారికి తెలియకుండానే హిందూత్వ సంస్కృతిని అమలు చేస్తున్నారని చెప్పారు. ఫాసిస్టు, మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్పొరేట్, మతతత్వ శక్తులు ఏకం : నీలోత్పల్‌బసు
దేశంలో కార్పొరేట్, మతతత్వ శక్తులు ఏకమవుతున్నాయని ఎస్ఎఫ్ఐ అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి నీలోత్పల్‌బసు చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించకుండా, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. స్వాతంత్య్రం రాకముందు, వచ్చిన తర్వాత అనేక చట్టాలున్నా కేంద్రం తెచ్చిన ఎన్ఈపీ సంక్లిష్టమైందని అన్నారు. అది అమలైతే అసమానతలు పెరుగుతాయనీ, ఎస్సీ,ఎస్టీలు, అమ్మాయిలు విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ విద్య, అందరికీ ఉపాధితోపాటు హిందూత్వ ఎజెండాకు వ్యతిరేకంగా విద్యార్థులను సమీకరించి ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
విద్యారంగాన్ని ధ్వంసం చేస్తున్న కేంద్రం :
వై వెంకటేశ్వరరావు
విద్యారంగాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నదని ఎస్ఎఫ్ఐ అఖిల భారత మాజీ అధ్యక్షులు వై వెంకటేశ్వరరావు విమర్శించారు. విద్యార్థి సంఘాలే లక్ష్యంగా నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తిరుపతిలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలోని పూజారులే రెగ్యులరైజేషన్ కోసం సీఐటీయూ జెండా పట్టుకుని పోరాడుతున్నారని గుర్తు చేశారు. కానీ చాలామంది మొక్కులు తీర్చాలంటూ ఆ పూజారుల వద్దకు వెళ్తున్నారని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఎవరైనా పోరాటం చేయాల్సిందేనని చెప్పారు.
విద్యార్థులు, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి : ఉమేష్
విద్యార్థులు, కార్మికుల ఐక్యత వర్థిల్లాలనీ, దేశాన్ని కాపాడేందుకు కలిసి పోరాడాలని సీఐటీయూ జాతీయ కార్యదర్శి కెఎన్ ఉమేశ్ అన్నారు. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌కోడ్‌లుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తేవడాన్ని విమర్శించారు. ఆ కోడ్ల అమలును కార్మికులు అంగీకరించే పరిస్థితి లేదన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వచ్చే ఏడాది జనవరి 30న ఢిల్లీలో కేంద్ర కార్మిక సంఘాల జాతీయ కన్వెన్షన్ నిర్వహిస్తున్నామని వివరించారు. ఏప్రిల్ ఐదున ఢిల్లీలో కార్మిక కర్షక సంఘర్ష్ ర్యాలీ ఉంటుందన్నారు.
ఎన్ఈపీని వ్యతిరేకిస్తున్నాం : మురళీధర్
నూతన జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ)ని వ్యతిరేకిస్తున్నామని ఎన్పీఆర్డీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ అన్నారు. వికలాంగ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభల్లో చర్చించాలని కోరారు. ఉన్నత విద్యలో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ఉన్నా అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వికలాంగులు ఎక్కువ మంది ఉన్నత విద్యనభ్యసించేలా కృషి చేయాలని కోరారు.
మనువాదం మహిళల చదువుకు వ్యతిరేకం : సుకన్య
మనువాద భావజాలం మహిళలు చదువుకునేందుకు వ్యతిరేకమని ఐద్వా నేత సుకన్య అన్నారు. ఎన్ఈపీ ద్వారా ఆర్ఎస్ఎస్ మనువాద భావజాలాన్ని అమలు చేయానలి కుట్ర చేస్తున్నదనీ, అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో విద్యార్థుల ప్రజాస్వామిక హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని విమర్శించారు. హిజాబ్ ధరిస్తే విద్యాసంస్థల్లోకి రానివ్వడం లేదన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై వచ్చే ఏడాది జనవరి ఆరు నుంచి కేరళలో ఐద్వా జాతీయ మహాసభలను నిర్వహిస్తున్నామని వివరించారు.
ఉపాధి కోసం ఉద్యమించాలి : హిమాంగరాజ్ భట్టాచార్య
దేశంలోని విద్యార్థులు, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ ఉద్యమించాలని డీవైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి హిమాంగరాజ్ భట్టాచార్య పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం ఏటా రెండు కోట్లా ఉద్యోగాలిస్తామంటూ యువతను మోసం చేసిందని విమర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన చదువు అందడం లేదనీ, యువతకు ఉద్యోగాలు లభించడం లేదన్నారు. వాటి సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని చెప్పారు.
భగత్‌సింగ్ వారసులు భయపడరు : విక్రంసింగ్
ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు భగత్‌సింగ్ వారసులనీ, వారు ఎవరికీ భయపడబోరని ఏఐఏడబ్ల్యూయూ జాతీయ కార్యదర్శి విక్రంసింగ్ అన్నారు. ప్రాణత్యాగానికైనా వెనుకాడబోరని చెప్పారు. విద్యార్థుల హక్కులు, వారి ఆకాంక్షల కోసం పోరాడుతారని వివరించారు. లక్షలాది మంది రైతులు ఐక్యంగా పోరాడ్డం వల్లే మూడు వ్యవసాయ చట్టాలను మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకుందన్నారు. అదే తరహాలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
గిరిజనులకు మెరుగైన విద్య కోసం పోరాడుదాం : ఆర్ శ్రీరాంనాయక్
గిరిజనులకు మెరుగైన విద్యావిధానం కోసం పోరాడాలని ఆదివాసీ, అధికార్ రాష్ట్రీయ మంచ్ (ఏఏఆర్ఎం) జాతీయ కమిటీ సభ్యులు ఆర్ శ్రీరాంనాయక్ పిలుపునిచ్చారు. అందరికీ విద్యను అందించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. ఒకే దేశం ఒకే భాష వల్ల గిరిజనులు, ఆదివాసీ భాషలకు ప్రమాదం వచ్చిందన్నారు. అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం కట్టబెడుతున్నదని చెప్పారు. గిరిజనుల సంస్కృతిపై కేంద్రం దాడి చేస్తున్నదని అన్నారు. గిరిజనుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలన్నారు.