Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాబోయే ఎన్నికలకు సమాయత్తమవుతున్నాం
- హిందూత్వ ప్రచారంతోనే గుజరాత్లో బీజేపీ గెలుపు..
- అందులో ఆశ్చర్యమేమీ లేదు...
- ఆ రాష్ట్రంలో అభివృద్ధి నమూనా ఏంటో బీజేపీ నేతలే చెప్పాలి
- ఒకే పార్టీ.. నియంతృత్వ విధానమే దాని సిద్ధాంతం
- అందుకే ప్రతిపక్షాలకు చెందిన ప్రభుత్వాలను నిలవనీయటం లేదు
- త్రిపురలో ఏ ఒక్క రాజ్యాంగ సంస్థా పనిచేయటం లేదు
- 'నవతెలంగాణ' ఇంటర్వ్యూలో త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్
గత నాలుగేండ్లుగా త్రిపురలో అధికార బీజేపీ సాగిస్తున్న అరాచకాలను ప్రజా పోరాటాల ద్వారా తిప్పికొడతామని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ ధీమా వ్యక్తంచేశారు. 'హిందూత్వ వాది...' ప్రచారంతోనే గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిచిందని ఆయన స్పష్టం చేశారు. కులం, మతం ఆధారంగా ప్రజలను విభజించిన ఆ పార్టీ... ప్రధాన సమస్యల నుంచి వారి దృష్టిని మరల్చిందని తెలిపారు. అయితే ఆ విజయం గురించి విపరీతంగా ప్రచారం చేసుకుంటున్న బీజేపీ నేతలు... ఆ రాష్ట్రంలో అభివృద్ధి నమూనా ఏంటో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఒకే పార్టీతో కూడిన నియంతృత్వ విధానమే దాని సిద్ధాంతమనీ, అందువల్లే వివిధ రాష్ట్రాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలను అది కూల్చివేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. త్రిపురలో ఏ ఒక్క రాజ్యాంగ సంస్థా పని చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం సైతం స్వేచ్చగా, స్వతంత్రంగా తన విధులు నిర్వహించలేని దుస్థితి నెలకొందని చెప్పారు. అయినప్పటికీ వివిధ సమస్యలపై ప్రజలను సమీకరించి పోరాడటం ద్వారా బీజేపీ ఆగడాలకు చెక్ పెడతామని ఆయన తెలిపారు. 2023లో త్రిపుర శాసనసభకు ఎన్నికలు నిర్వహించ నున్న నేపథ్యంలో... ఆ ఎలక్షన్లకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నామని వివరించారు. ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభల నేపథ్యంలో హైదరాబాద్‌కు విచ్చేసిన మాణిక్ సర్కార్... నవతెలంగాణ ప్రతినిధి బి.వి.యన్.పద్మరాజుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తున్న వైనం, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత త్రిపురలో నెలకొన్న పరిస్థితులు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు తదితరాంశాలను సర్కార్ విశ్లేషించారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు...
- ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీ గెలిచింది. హిమాచల్‌లో ఓడింది. డీఎంసీని ఆప్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో గుజరాత్లో బీజేపీ మళ్లీ విజయం సాధించటాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు..? మూడు చోట్ల మూడు రకాల ఫలితాలొచ్చాయి. దానికి కారణం ఏమంటారు..?
ముందుగా నేను గుజరాత్ గురించి మాట్లాడతాను. అక్కడి బీజేపీ విజయంపై ఎవరూ పెద్దగా ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రధాని హోదాలో మోడీ... గుజరాత్లో 33 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఆయన ఓటేయటానికి వచ్చిన (పోలింగ్ రోజు) రోజు ఏకంగా ఒక రోడ్ షోనే నిర్వహించారు. ఇది ఎన్నికల నియమావళికి, నిబంధనలకు విరుద్ధం. అయినా ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఆయనతోపాటు ప్రధాని కూడా గుజరాత్‌కు చెందిన వారే కావటం ఇక్కడ గమనార్హం. మరోవైపు హిందూత్వవాదం పేరుతో బీజేపీ ప్రజల్ని విభజించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి... నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. నిరుద్యోగం, దరిద్రం, ఆకలి, రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. కార్మికులకు కనీస వేతనాలు దక్కటం లేదు. ఈ సమస్యలన్నీ గుజరాత్‌లోనూ ఉన్నాయి. ఇలాంటి ప్రధానాంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ హిందూత్వవాదాన్ని తీసుకొచ్చింది. అందుకే అక్కడ అది మళ్లీ గెలవగలిగింది. మరోవైపు రాష్ట్రంతోపాటు కేంద్రంలోని అధికార యంత్రాంగం కూడా బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి కదా..? వీటికితోడు అంగబలం, అర్థబలం... వీటన్నింటితోనే అక్కడ ఆ పార్టీ గెలవగలిగింది తప్ప వేరేదేమీ కాదు. ఎన్నికల్లో గెలుపు గురించి చెప్పుకుంటున్న బీజేపీ నేతలను...అక్కడి అభివృద్ధి నమూనా గురించి చెప్పమనండి..? వారు చెప్పలేరు. ఎందుకంటే చెప్పుకోవటానికి వారికి ఏమీ లేదు కాబట్టి. హిమాచల్‌లో కూడా ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ, మోడీ శతవిధాలా ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. ఢిల్లీ ప్రజలు బీజేపీని తిరస్కరించారు. ఢిల్లీలో జరిగింది మున్సిపల్ ఎన్నికలే అయినా ఎలక్ట్రోరల్ సైజు ప్రాతిపదిగ్గా చూస్తే... అవి హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల కంటే పెద్దవి, ప్రాధాన్యతగలవి. అక్కడ అధికారాన్ని ఉపయోగించి గెలవాలనుకున్నా బీజేపీని ప్రజలు తిరస్కరించారు. 15 ఏండ్ల ఆ పార్టీ పాలనకు తెరదించారు. 0.5 శాతం ఓట్లతో హిమాచల్‌లో ఓడామంటూ బీజేపీ చెప్పటం హాస్యాస్పదం. అక్కడ గెలిచారా.. ఓడారా..? అన్నది ముఖ్యం తప్ప ఓట్ల శాతం కాదు.
- ఈ ఫలితాలను ఏ విధంగా చూడొచ్చు...?
వీటి ఆధారంగా బీజేపీకి క్రమక్రమంగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయని భావించవచ్చు. వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు దాన్ని తిరస్కరిస్తున్నారని చెప్పొచ్చు. ఆ పార్టీ ప్రభావం తగ్గుతూ వస్తోంది.
తెలంగాణలో ఇటీవల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నించింది. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అది కూలుస్తూ వస్తోంది. ఆ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడటం వెనుక ఉద్దేశం...?
తెలంగాణలోనే కాదు కదా.. దేశవ్యాప్తంగా ఇదే జరుగుతున్నది. దేశం మొత్తం మీద ఒకే ఒక పార్టీ ఉండాలి.. దాని నియంతృత్వం కొనసాగాలన్నదే బీజేపీ సిద్ధాంతం. అందుకే ఇతర రాష్ట్రాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలను అది కూలుస్తూ వస్తోంది. వివిధ పార్టీల్లోని నాయకుల బలహీనతల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వారిపై ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తూ వస్తోంది. తన విధానాలను ప్రశ్నించే పార్టీలను, వాటికి వ్యతిరేకంగా పోరాడే నాయకులను ఇబ్బంది పెడుతూ వస్తోంది.
- త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగేండ్ల కాలంలో అనేక హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటాన్ని గమనిస్తున్నాం.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది..?
అధికార బీజేపీ నాలుగేండ్లుగా అక్కడ సీపీఐ (ఎం) లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నది. మా పార్టీ కార్యాలయాలను ఆక్రమించటం, తగులబెట్టటం, లూఠీ చేయటం లాంటి చర్యలకు పాల్పడుతున్నది. కార్యకర్తలపై దాడులు చేయటం, చంపటం లాంటి దుశ్చర్యలను కొనసాగిస్తున్నది. మరోవైపు ముస్లింలు, క్రిస్టియన్లను టార్గెట్ చేస్తూ, వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నది. వారిపై దాడులకు పాల్పడుతున్నది. ప్రజలను కలుసుకునేందుకు వెళ్లిన సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీ నేతలు, ఎమ్మెల్యేలను సైతం అడ్డుకునేందుకు, నియంత్రించేందుకు పూనుకుంటున్నది. అక్కడి పోలీసులు ఇలాంటి చర్యలను నిరోధించకుండా చోద్యం చూస్తున్నారు. పైగా వారు అధికార పార్టీ కనుసన్నల్లో పని చేస్తూ విపక్షాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అసెంబ్లీలో సైతం ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశమివ్వకుండా అధికార పార్టీ మైక్ కట్ చేయిస్తోంది. బీజేపీ విధానాల వల్ల విద్య, వైద్య రంగాలు ప్రజలకు అందకుండా పోతున్నాయి. ఉపాధి మృగ్యమైంది. జీవనోపాధి కోల్పోయిన గిరిజనులు తమ బిడ్డలను పోషించలేక వారిని ఇతర రాష్ట్రాల్లోని వారికి అమ్ముకుంటున్న దుస్థితి నేడు తలెత్తింది. బీజేపీ ఏలుబడిలో ఇలాంటి దుర్భర పరిస్థితులను త్రిపుర ప్రజలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. ఇది అత్యంత బాధాకరం.
- ఇలాంటి పరిస్థితుల్లోనే వచ్చే ఏడాది (2023) మీ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి..? వాటికి ఎలా సన్నద్ధమవుతున్నారు..?
బీజేపీ ఎన్ని నిర్బంధాలను ప్రయోగించి, మమ్మల్ని అణచాలని చూసినా సీపీఐ (ఎం)గా మేం వెనకడుగు వేయటం లేదు. ప్రతిపక్ష నేతగా నేను, మా పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు నిత్యం ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం. తద్వారా వాటిని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకొన్న పరిస్థితులను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. వారు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుంటున్నారు. త్రిపురలో ఇంకోసారి బీజేపీ అధికారంలోకి వస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. అందువల్ల ఒకవైపు ఆ పార్టీ విధానాలపై సీపీఐ (ఎం)గా పోరాడుతూనే.. మరోవైపు ప్రజలను సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆ రకంగా వచ్చే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాం.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ గురించి మీ అభిప్రాయం...
ఏ నాయకుడైనా పార్టీని ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో దాన్ని విస్తరించాలని భావించవచ్చు. అదే నా అభిప్రాయం.