Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంధన ధరల పెంపుపై మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ సహా ఏపీ, తమిళనాడు, కేరళ, ఝార్ఖండ్ ప్రభుత్వాలు ఇంధనాలపై అధిక వ్యాట్‌ను వసూలు చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ఖండించారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజలపై పెట్రో భారం ఎక్కువగా పడుతోందంటూ లోక్‌సభలో కేంద్ర మంత్రి పేర్కొనడాన్ని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఇంధన ధరలు పెరిగాయని ఆరోపించిన కేటీఆర్.. 2014 నుంచి ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ పెంచలేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సెస్‌ను తొలగిస్తే లీటర్ పెట్రోల్‌ను రూ.70కి, డీజిల్ రూ.60కి అందిస్తామని చెప్పారు. కేంద్ర సెస్ రూపంలో రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన 41 శాతం వాటా కోల్పోయమన్నారు. ఇప్పటికే సెస్ రూపంలో వసూలు చేసిన రూ.30లక్షల కోట్లు సరిపోవా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశంలో బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న ఆరు రాష్ట్రాల్లో పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించలేదని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ గురువారం లోక్‌సభలో వెల్లడించిన విషయం తెలిసిందే. అందువల్లే ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందంటూ హర్దీప్ సింగ్ గుర్తుచేశారు. దీనికి కొనసాగింపుగా కొన్ని రాష్ట్రాలు ప్రజలపై భారం తగ్గించడం కోసం వ్యాట్‌ను తగ్గించాయని తెలిపారు. ఆయన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు.