Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశాలకు కనీస వేతనం రూ.26 వేలివ్వాలి
- ఆశాల 48గంటల నిరవధిక ధర్నా
నవతెలంగాణ- విలేకరులు
ఆశా వర్కర్లు చేసే అదనపు పనులకు అదనపు వేతనం చెల్లించాలని, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ కమ్యూనిటీ అండ్ హెల్త్ (ఆశా) వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో 48 గంటల నిరవధిక ధర్నా చేపట్టారు.ఖమ్మం నగరంలోని ధర్నాచౌక్లో ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రదర్శనగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేపట్టారు. కార్యాలయం ఎదుట బైటాయించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. అదనపు పనులు చేయించుకున్నప్పుడు అదనపు డబ్బులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. అనంతరం డీఎంహెచ్వో మాలతికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వర్లు, అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు పి.రమ్య పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా చౌక్ వద్ద వందలాది మంది ఆశా వర్కర్ల 48 గంటల నిరవధిక ధర్నా చేపట్టారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్ ప్రారంభించి మాట్లాడారు. ప్రజల ప్రాణాన్ని రక్షిస్తున్న ఆశా వర్కర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ.. ఆశావర్కర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం జరుగుతున్న పోరాటానికి సీపీఐ(ఎం) అండగా ఉంటుందన్నారు. ఆశాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట 48 గంటల ధర్నా ప్రారంభించారు.