Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు బడులకు కాషాయరంగు
- విద్యార్థులు కోడిగుడ్డు తినొద్దంటూ ఆదేశాలు
- విద్యారంగంలోకి హిందూత్వ ఎజెండా, మనువాద భావజాలం
- జ్యోతిష్య శాస్త్రం చెప్పేందుకు బెంగుళూరులో చాణక్య వర్సిటీ ఏర్పాటు
నవతెలంగాణతో ఎస్ఎఫ్ఐ కర్నాటక కార్యదర్శి వాసుదేవరెడ్డి
భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత కాదంటూ కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం చెప్తున్నదని ఎస్ఎఫ్ఐ ఆ రాష్ట్ర కార్యదర్శి వాసుదేవరెడ్డి అన్నారు. ఇది ఆయనను అవమానించడమేనని చెప్పారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలకు హాజరైన వాసుదేవరెడ్డి నవతెలంగాణ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
'మా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక విద్యారంగం సర్వనాశనం అయ్యింది. ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేస్తున్నది. 30 మంది కంటే తక్కువ విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలలను మూసేయాలని చూస్తున్నది. ఇది అమలైతే 35 శాతం గ్రామాల్లో సర్కారు బడి కనిపించదు. ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులు నెలకు రూ.100 చెల్లించాలంటూ చెప్తున్నారు. ఎందుకని అధికారులను అడిగితే ప్రభుత్వం వద్ద నిధుల్లేవనీ, మౌలిక వసతులు, నీళ్లు, మరుగుదొడ్ల కోసం ఇవ్వాలంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉచిత విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత. కానీ ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తున్నది. భగత్‌సింగ్, అంబేద్కర్, మహాత్మాగాంధీ, సావిత్రిబాయి ఫూలే వంటి మహనీయుల చరిత్రను తొలగించి హెడ్గేవార్, వీడి సావర్కర్ వంటి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చింది. అయితే సిలబస్ కమిటీలో 11 మంది బ్రాహ్మణులు ఆర్ఎస్ఎస్కు చెందిన వారే ఉన్నారు. ఆ కమిటీకి చైర్మెన్‌గా రోహిత్ చక్రతీర్ధ మహిళా వ్యతిరేకి. కులవ్యవస్థ మంచిదంటూ ప్రచారం చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత కాదంటున్నారు. సర్కారు బడుల్లో అగ్రకులాల పిల్లలున్నందున కోడిగుడ్డు తినొద్దంటున్నారు. అయితే గుడ్డు తినని వారికి అరటిపండు, తృణధాన్యాలు ఇవ్వాలని చెప్తున్నాం. అనేక పోరాటాల తర్వాత గుడ్డు ఇస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ల భవనాలకు కాషాయరంగు వేస్తున్నారు. మౌలిక వసతులు కల్పించకపోయినా, టీచర్ల ఖాళీలను భర్తీ చేయకపోయినా ఇది మాత్రం చేస్తున్నారు. ఎందుకంటే త్వరలోనే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. సర్కారు బడులే పోలింగ్ కేంద్రాలుగా ఉంటాయి. ప్రజల మైండ్‌ను మార్చేందుకు కాషాయరంగు వేస్తున్నారు. విద్యలోకి హిందూత్వ ఎజెండాను, మనువాద భావజాలాన్ని తీసుకెళ్తున్నారు. పాఠశాలల్లో భగవద్గీతను పఠనం చేయిస్తున్నారు. హిజాబ్ వంటి వివాదాన్ని సృష్టించి హిందూ, ముస్లిం విద్యార్థులను విభజించారు. విద్యాసంస్థల్లో జాతీయ జెండాను ఎగరేయాల్సిందిపోయి కాషాయజెండాను ఎగరేశారు. అంబేద్కర్ ఎస్సీ,ఎస్టీ హాస్టళ్లకు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పేరు పెడుతున్నారు. స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్, సైకిళ్లు ఇవ్వడం లేదు. ప్రయివేటు విద్యారంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రయివేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇస్తున్నారు. ప్రయివేటు కాలేజీలకు అటానమస్ హోదా ఇస్తున్నారు. నాలుగేండ్లుగా హంపీ యూనివర్సిటీలో ఎస్సీ,ఎస్టీ రీసెర్చ్ స్కాలర్లకు ఫెలోషిప్ ఇవ్వలేదు. విద్యార్థులు పోరాడితే కేసులు పెట్టి అణచివేస్తున్నారు. ప్రభుత్వ వర్సిటీలకు నిధులివ్వడం లేదు. ఇంకోవైపు సంస్కృత వర్సిటీకి రూ.150 కోట్లు కేటాయించారు. జ్యోతిష్యశాస్త్రాన్ని బోధించడం కోసం బెంగుళూరులో చాణక్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ఈపీ అమలైతే ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీలు సగం మూతపడే ప్రమాదమున్నది. విద్యార్థులు ఫలితాలు చూసుకోవాలన్నా, మెమో డౌన్లోడ్ చేసుకోవాలన్నా రూ.150 చొప్పున కట్టాలి. మంత్రి సిఎన్ అశ్వధ్నారాయణ్ డిజిటల్ విధానాన్ని ఆయన బినామీకి అప్పగించారు. దానివల్ల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఇలా బీజేపీ ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నది.'అని వాసుదేవరెడ్డి చెప్పారు.