Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ పాలనంతా అవినీతి అక్రమాల మయం
- బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన కేసీఆర్ పార్టీ త్వరలోనే వీఆర్ఎస్ తీసుకుంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. కరీంనగర్ ఎంపీ సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర గురువారం కరీంనగర్లో ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడారు. ఈ యాత్ర ఇక్కడితో ఆగేదికాదని, మరిన్ని రోజులు కొనసాగుతుందని అన్నారు. ప్రజల గోస.. బీజేపీ భరోసా అని, సాలు దొర.. సెలవు దొర నినాదం పక్కాగా జరుగుతుందని అన్నారు. వచ్చేప్పుడు తననూ అడ్డుకునేందుకు ప్రయత్నించారని, ఇది కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని, ఆయన్ను త్వరలోనే ప్రజలు చెత్తకుప్పలో వేస్తారంటూ జోస్యం చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి, అరాచక, ప్రజా వ్యతిరేకంగా సాగుతుందని, ఆయన పాలనకు గుడ్‌బై చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. మోడీ పాలనలోనే సబ్ కా సాత్.. సబ్ కా విశ్వాస్ నిరూపితమైందంటూ వివరించారు. కేంద్రం నుంచి జాతీయ రహదారుల కింద భారీఎత్తున నిధులు మంజూరు చేశామని, జల్ జీవన్ మిషన్ కింద కూడా పెద్దఎత్తున నిధులు ఇచ్చామని చెప్పారు. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం రూ.3.29 కోట్ల అప్పుల కుప్పగా మారిందని, ఆయన కూతురు కవిత అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. 'ధరణి పోర్టల్' పేరుతో.. టీఆర్ఎస్ నేతలు పేదల భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు. ఓవైసీకి భయపడే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా కేసీఆర్ నిర్వహించడం లేదన్నారు. తన ప్రసంగమంతా కేసీఆర్‌పైనా, ఆ కుటుంబంపైనా విమర్శలతోనే సాగడం గమనార్హం. ముగింపు యాత్రలో ఎంపీ బండి సంజయ్ సహా బీజేపీ నేతలు పాల్గొన్నారు.