Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలో ప్రత్యామ్నాయ విద్యావిధానం
- ఎస్ఎఫ్ఐ జాతీయ సంయుక్త కార్యదర్శి కెఎం సచిన్ దేవ్
నవతెలంగాణ బ్యూరో - మల్లు స్వరాజ్యం నగర్ (హైదరాబాద్)
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నియంతృత్వ విధానాలతో దేశ ప్రజల హక్కులను హరిస్తున్నదని ఎస్ఎఫ్ఐ జాతీయ సంయుక్త కార్యదర్శి, కేరళ ఎమ్మెల్యే కెఎం సచిన్‌దేవ్ అన్నారు. హైదరా బాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలకు హాజరైన సచిన్‌దేవ్ గురువారం నవతెలంగాణ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...'ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా కేంద్రం నూతన విద్యావిధానం (ఎన్ఈపీ)-2020ని తీసుకొచ్చింది. అది విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేటీకరణ దాని లక్ష్యం. అయితే దేశానికే రోల్‌మోడల్‌గా ప్రత్యామ్నాయ విద్యావిధానాన్ని కేరళ వామపక్ష ప్రభుత్వం అమలు చేస్తున్నది. మా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకే తొలి ప్రాధాన్యం. తొలి నాళ్లలో ప్రాథమిక విద్య అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేశాయి. తర్వాత ఉన్నత విద్యపై దృష్టి సారించాయి. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్యావిధానం వల్లే కేరళ విద్యారంగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. అక్షరాస్యతలోనూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. కార్పొరేట్ విద్యాసంస్థలను బాగుచేసేందుకే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎన్ఈపీని తెచ్చింది. దీన్ని విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థులందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశంలో విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం చాలా సమస్యలతో సతమతమవుతున్నాయి. వర్సిటీల్లో ప్రజాస్వామిక వాతావరణాన్ని ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం కలుషితం చేస్తున్నది. గవర్నర్‌ను వర్సిటీల ఛాన్సలర్ బాధ్యతల నుంచి తప్పిస్తూ కేరళ అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. వ్యాపారీకరణ, కాషాయీకరణ, ప్రయివేటీకరణ విధానాలతో విద్యారంగాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తున్నది. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి. విద్యార్థుల ప్రజాస్వామిక హక్కులను రక్షించాలి. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఈ మహాసభల్లో చర్చించి పరిష్కారమార్గాలు అన్వేషిస్తాం. భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తాం.'సచిన్‌దేవ్ అన్నారు.