Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులకు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సిద్దిపేటలో ఈ నెల 21 నుంచి 23 వరకు జరుగనున్న సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభల జయప్రదాన్ని కోరుతూ ఈ నెల 19న కార్మిక, పారిశ్రామిక వాడలు, మండల, జిల్లా కేంద్రాల్లో యూనియన్ అనుబంధ సంఘాలు జెండాలను ఎగురవేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లో సీఐటీయూ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రతిమ బూనాలన్నారు. 23న సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కార్మికుల స్థితిగతులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, మూడేండ్ల కాలంలో సీఐటీయూ నిర్వహించిన పోరాటాలు, సమ్మెలను సమీక్షించి భవిష్యత్ ఉద్యమాలకు రూపకల్పన చేస్తామన్నారు. షెడ్యూల్ పరిశ్రమల జీవోల జారీ, జీవోలను గెజిట్ చేయడం, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించడం, తదితర కార్మిక సమస్యలపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తామన్నారు. కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు, విద్యుత్ సవరణ బిల్లు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలు తీర్మానాలు చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. మొదటి రోజు మహాసభలను సీఐటీయూ జాతీయ అధ్యక్షులు కె.హేమలత, జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ప్రారంభిస్తారని తెలిపారు. అఖిల భారత కేంద్రం నుంచి మహాసభల పరిశీలకులుగా జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు హాజరవుతారని చెప్పారు.