Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోని జంతువులకు ఆరోగ్య సేవలందించేందుకు యూఎస్ఏకు చెందిన విస్కిన్సిన్ యూనివర్సిటీ (మ్యాడిసన్)తో ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ (జీవీకే ఈఎంఆర్ఐ) ఒప్పందం చేసుకున్నది. గురువారం హైదరాబాద్ కొంపల్లిలోని ఈఎంఆర్ఐ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో జీవీకే ఈఎంఆర్ఐ డైరెక్టర్ కె.కృష్ణంరాజు, విస్కిన్సిన్ స్కూల్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ క్రిష్టఫర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం మేరకు రానున్న ఐదేండ్ల కాలంలో పశు వైద్యులకు, మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ 1,962 మొబైల్ మెడికల్ యూనిట్లు పని చేస్తున్నాయని తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 800 జంతువుల అంబులెన్సులు నడిపిస్తున్నామనీ, అత్యవసర పరిస్థితుల్లో ఇంటి వద్దకే వెళ్లి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఈఎంఆర్ఐతో ఒప్పందం చేసుకోవడం పట్ల క్రిష్టఫర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీకే ఈఎంఆర్ఐ జీహెచ్ఎస్ అధ్యక్షులు సుబోధ్ సత్యవాది, జీవీకే ఈఎంఎల్సీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ జీ.వీ.రమణ రావు, జీవీకే ఈఎంఆర్ఐ 1962 మొబైల్ వెటర్నరీ సర్వీసెస్ రాష్ట్ర సీఒఒ ఖలీద్ పాల్గొన్నారు.