Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలో తీర్మానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తున్న వామపక్ష పాలనలోని కేరళ విద్య మోడల్‌ను దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ విద్య విధానంగా అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభ తీర్మానించింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభలో ఇ. అఫ్సల్ తీర్మానాన్ని ప్రతిపాదించగా, సత్యేషా బలపరిచారు. ఒక్కో నియో జకవర్గానికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక్కో స్కూల్‌ను ఏర్పాటు చేసి కేరళ ప్రభుత్వం రూ.ఐదు కోట్లను కేటాయించిందని తెలిపారు. అక్కడి బడులకు ప్రభుత్వం భవనాలు, హైటెక్ సాంకేతిక సౌకర్యాలను కల్పించిందని తెలిపారు. దీని ఫలితంగా గత ఆరేండ్లలో ప్రయివేటు పాఠశాలలకు చెందిన 6.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్టు వెల్లడించారు. కేరళను జ్ఞాన సమాజంగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించిన వామపక్ష సర్కారు ఉన్నత విద్యకు నిధులు పెంచాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇప్పటికే 1,500 హాస్టల్ రూములు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. మెరుగైన ఉన్నత విద్యపై అధ్యయనం చేసేందుకు అక్కడి ప్రభుత్వం కమిషన్ వేసిందనీ, ఇటీవల రూ.100 కోట్లను కేటాయించిందని తెలిపారు. ఈ విధానం కేరళకు మాత్రమే కాదనీ, మొత్తం దేశానికే ప్రత్యామ్నాయమని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్య నుంచి తప్పుకుంటూ ప్రయివేటుపరం చేస్తుండగా, అందుకు భిన్నంగా కేరళలో ప్రభుత్వ విద్య బలపడుతూ, అందరికి అందుబాటులోకి వస్తున్నదని చెప్పారు.
మహాసభ సీఏఏ, ఎన్టీఏ, సీయూఇటీకు వ్యతిరేకంగా తీర్మానించింది. వాతావరణ మార్పులపై ప్రభావవంతంగా పోరాడాలనీ, విద్యాలయాల ప్రాంగణాల్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలనీ, కర్ణాటకలో ముస్లీం విద్యార్థినీలు హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపాదించిన కూడా మహాసభ తీర్మానాలను ఆమోదించింది. బహుళ భాషల వైవిధ్య భారతదేశంలో ఒకే భాషను రుద్దే ప్రయత్నాలను తప్పుపట్టింది. నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడాలని ఎస్ఎఫ్ఐ నిర్ణయించింది. ప్రపంచశాంతిని ఆకాంక్షించింది. మొత్తంగా గురువారం నాటి మహాసభలో తొమ్మిది తీర్మానాలను ఆమోదించారు.