Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు, భద్రాద్రి జిల్లా పోలీసుల పనితీరు భేష్ :రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను పటిష్ట పరచడం వల్ల శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోలీసుల పనితీరు భేష్‌గా ఉందని, వారి కృషి వలన మావోయిస్టు ప్రాభల్యం రెండు జిల్లాల్లో పూర్తిగా తగ్గిందని తెలిపారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతం ఛత్తీస్‌గఢ్ సరిహద్దు చర్ల ప్రాంతాల్లోని ఆలుబాకా పోలీస్ బేస్ క్యాంపును ఆయన సందర్శించారు. అనంతరం హెలికాప్టర్లో నేరుగా కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, హేమచంద్రపురం పోలీస్ బెటాలియన్ క్యాంపుకు, అక్కడి నుంచి చర్ల అనంతరం హెలికాప్టర్ ద్వారా హేమచంద్ర పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు చేరుకున్నారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుగు ప్రయాణంలో మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల అణచివేతకు జిల్లా పోలీస్ స్పెషల్ పార్టీ తీవ్రంగా కృషి చేశారని తెలిపారు. ప్రజలు, పోలీసులు సమిష్టిగా పనిచేయడం వల్ల ములుగు, భద్రాద్రి కొత్తగూడెం రెండు జిల్లాలలో మావోయిస్టు ప్రాభల్యం పూర్తిగా లేకుండా పోయిందని, నిరంతరం పోలీసు ఆపరేషన్ వలన ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే పరిశ్రమలు నెలకొల్పేందుకు ఇతర ప్రాంతాల నుంచి పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారని, తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాల ద్వారా నిఘా పటిష్టం చేశామని, రాష్ట్ర పోలీస్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్రంగంగా ఉందన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విషయాన్ని వెల్లడించారు. కార్యక్రమంలో భద్రాద్రి, ములుగు జిల్లాల ఎస్పీలు డాక్టర్ జి.వినీత్, సంగ్రామ్ సింగ్ పాటిల్, కొత్తగూడెం ఓఎస్డీ సాయి మనోహర్, ములుగు ఓఎస్డీ గౌస్ అలాం, అడిషనల్ ఎస్పీ శోభన్ కుమార్, భద్రాచలం, ములుగు, ఏటూరు నాగారం ఏఎస్పీలు రోహిత్ రాజు, అశోక్ కుమార్, సుధీర్.కె.కేకర్, సీఆర్పీఎఫ్ కమాండెంట్లు ప్రశాంత్ ధర్, సంజీవ్ కుమార్, 6వ టీఎస్ఎఎస్పీ బెటాలియన్ కమాండెంట్ రమణా రెడ్డి, డీఎస్పీలు వెంకటేశ్వర బాబు, రమణ మూర్తి, సత్యనారాయణ, జిల్లాలోని ఇతర పోలీసు అధికారులు, రెండు జిల్లాల స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.