Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తండ్రీకొడుకులకు గాయాలు
- లోయర్ ట్యాంక్‌బండ్ సమీపంలో ఘటన
నవతెలంగాణ-అడిక్‌మెట్
చెత్త డంపింగ్ యార్డులో కెమికల్ డబ్బా పేలడంతో తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోయర్ ట్యాంక్ బండ్ స్నో వరల్డ్ సమీపంలో గురువారం జరిగింది. వివరాల్లోకెళ్తే.. కర్నూలు జిల్లా నాంచార్ల గ్రామానికి చెందిన చంద్రన్న, ఆయన కుమారుడు సురేష్ జేబీఎస్ మడ్‌ఫోర్డ్ ప్రాంతంలో నివాసముంటున్నారు. వారు ప్రతిరోజూ లోయర్ ట్యాంక్ బండ్ డంపింగ్ యార్డులో చెత్త సేకరిస్తూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం కూడా చెత్త ఏరుకుంటుండగా వాల్ పెయింట్లకు ఉపయోగించే కెమికల్ రసాయనిక డబ్బా కనిపించింది. అది తెరవడానికి వారు ప్రయత్నించగా ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిద్దరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. సురేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మోహన్‌రావు తెలిపారు. పేలుడు సమాచారం అందుకున్న గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు శోభన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావుతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా ఆదుకుంటామని వారు హామీ ఇచ్చారు.