Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యారంగ సమస్యలపై పోరాడుతున్నందుకే మాపై బీజేపీ దాడి
- సైద్ధాంతిక అవగాహనతో మాకు భయంలేదు
- ఉద్యమిస్తాం... గెలుస్తాం...
- ఎస్ఎఫ్ఐ గుజరాత్ కార్యదర్శి నితీష్ మోహన్
నవతెలంగాణ బ్యూరో - మల్లు స్వరాజ్యం నగర్ (హైదరాబాద్)
గుజరాత్లో ఉన్నది అభివృద్ధి మోడల్ కాదనీ, మోదాని (మోడీ, అంబానీ, అదాని) మోడల్ అని ఎస్ఎఫ్ఐ గుజరాత్ కార్యదర్శి నితీష్ మోహన్ అన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో నిర్వ హించిన ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలకు హాజరైన ఆయన గురు వారం నవతెలంగాణ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు... 'విద్యారంగ సమస్యలు, విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేస్తే మాపై బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ గూండాలు దాడి చేస్తున్నారు. వారికి పోలీసులు కూడా సహకరిస్తున్నారు. ఓ నాయకునిపై ప్రభుత్వం పీడీ యాక్ట్‌ను పెట్టింది. రాష్ట్రంలో ఎల్లప్పుడూ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఆర్నెల్లకోసారి పునరుద్ధరిస్తారు. అయినా సైద్ధాంతిక అవగాహన బలంగా ఉండడం వల్ల మాకు ఎలాంటి భయం లేదు. సమస్యలపై భవిష్యత్తులోనూ పోరాడుతూనే ఉంటాం. గుజరాత్లో ప్రభుత్వ పాఠశాలల్లో 15 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకరిద్దరు ఉపాధ్యాయులతో బోధన సాగుతున్నది. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంకోవైపు ఎన్ఈపీలో భాగంగా 30 మంది కంటే విద్యార్థులు తక్కువున్న సుమారు 5,560 ప్రభుత్వ పాఠశాలలను మూసేయాలని విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇది పేద విద్యార్థులకు తీవ్ర నష్టదాయకం. ఉపాధ్యాయ ఖాళీలు, వసతుల్లేకపోవడంతో అనివార్యంగా విద్యార్థులు ప్రయివేటు స్కూళ్లకు వెళ్తున్నారు. మా పోరాటం వల్లే రాష్ట్రంలో ఎస్సీ హాస్టళ్లలో ఉదయం అల్పాహారం అందుతున్నది. ఇది మాలో ఉత్సాహం నింపింది. ఈ స్ఫూర్తితో ఇతర సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తాం. ఉద్యమిస్తాం... గెలుస్తాం అన్న ధీమా ఉంది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. పోటీపరీక్షలు, ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజీ కాకుండా చూడాలి. యువతకు ఉద్యోగాలివ్వాలి. విద్యార్థులకు ఉచితంగా బస్‌పాస్ ఇవ్వాలి. ఈ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులను సమీకరించి ఉద్యమిస్తాం. అయితే ఇది గుజరాత్లో అంత సులువు కాదు. అయినా మా వంతు ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం.