Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మెయినాబాద్ ఫాంహౌస్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలుకు ప్రయత్నించారంటూ పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తు సీబీఐకి ఇవ్వాలని దాఖలైన కేసుల్లో హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, నిందితులు రామచంద్రభారతి, శ్రీనివాస్, సింహయాజి, నందకుమార్, తుషార్ ఇతరులు వేసిన పిటిషన్లపై జస్టిస్ విజరుసేన్రెడ్డి విచారణను ముగించారు. ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తు పూర్తి కాకుండా అడ్డుకునే అధికారం కోర్టులకు లేదని రాష్ట్ర ప్రభుత్వం, సిట్ల తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదించారు. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తును ప్రాథమిక దశలో అడ్డుకునే అధికారం కోర్టులకు లేదని సుప్రీంకోర్టు... అరుణబ్గోస్వామి కేసులో తీర్పు చెప్పిందన్నారు. పోలీసులు దర్యాప్తును పూర్తి చేసి కింది కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసే వరకు కోర్టులకు ప్రమేయం చాలా అరుదుగా ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కుట్ర చేసిన వాళ్లకు రాజ్యాంగం ప్రకారం రక్షణ కల్పించవద్దన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసును అవినీతి కేసును సాధారణ పోలీసులు దర్యాప్తు చేయడానికి వీల్లేదని, ఏసిబీ విచారణ చేయాలని పిటిషనర్లు చేసిన వాదన చట్ట వ్యతిరేకమన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు చేయడం ద్వారా ప్రజా తీర్పును కాలరాసేందుకు కుట్ర చేసిన వారికి, తెర వెనుక మద్దతు తెలిపే వారిపై సిట్ విచారణ కొనసాగేందుకు వీలుగా పిటిషన్లు కొట్టేయాలని కోరారు. పిటిషనర్ అనుమానిస్తున్నట్టుగా నిజంగానే ఎమ్మెల్యే కొనుగోలు కుట్ర కేసు వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నప్పటికీ క్రిమినల్ కేసు దర్యాప్తును ప్రాథమిక దశలో అడ్డుకునే హక్కు ఎవరికీ ఉండదన్నారు. ఈ కేసులో నిందితులు ఫలానా దర్యాప్తు సంస్థకు కేసు అప్పటించాలని అభ్యర్థించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు కేసును బదిలీ చేయాలని కోరే హక్కు నిందితులు, ఫిర్యాదుదారుడు, పిటిషనర్లకు ఎప్పటికీ ఉండబోదని వివరించారు. క్రిమినల్ కేసుల్లో నిందితులకే చట్టంలో రక్షణ ఉంటుందని, చార్జిషీట్ దాఖలు చేసే వరకు నిందితులు కూడా వేచి ఉండాలని చెప్పారు. చార్జిషీట్ దాఖలు చేశాక కింది కోర్టులో విచారణను సవాల్ చేసే హక్కు చట్టంలో ఉందన్నారు. ఎమ్మెల్యేల ఎర కేసుతో తమకు సంబంధం లేదని చెబుతున్న బీజేపీ కేసుల మీద కేసులేస్తూ దర్యాప్తును అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తోందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసిన 24 గంటల్లోపే హైకోర్టులో బీజేపీ రిట్ పిటిషన్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. పోలీసులు నమోదు చేసిన కేసును అదీ అవినీతి కేసును సిట్ దర్యాప్తు చేయడానికి వీల్లేదనీ, ఏసిబీ మాత్రమే విచారణ చేసే వీలుందని పిటిషనర్ల వాదన. సీఎం కేసుకు చెందిన అన్ని వివరాలను మీడియాకు చెప్పారనీ, కేసు దర్యాప్తు ఎలా ఉండాలో పోలీసుల కు సీఎం సూచనలు చేయడమే అవుతుందన్నారు. కేసు దర్యాప్తునకు ముందు ఆ కేసు వివరాలను మీడియాకు వెల్లడించరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ కు వ్యతిరేకంగా పోలీస్ కమిషనర్ కూడా వ్యవహరించారని చెప్పారు. సిట్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నందున కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. వాదనల తర్వాత హైకోర్టు తీర్పును తర్వాత చెబుతామంటూ ప్రకటించింది.