Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ కేరళ నాయకులు ఆర్య ప్రసాద్
మల్లుస్వరాజ్యం నగర్ నుంచి నవతెలంగాణ ప్రతినిధి
'ఇడుక్కి గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న ధీరజ్‌ను ఈ ఏడాది కేఎస్‌యూ గుండాలు చంపేశారు. 2007లో మా అన్నయ్యనూ(అజయ్ ప్రసాద్) ఆర్ఎస్ఎస్ గుండాలు కొట్టి చంపేశారు. అందరికీ విద్య, సమానత్వం కోసం కొట్లాడుతున్నాం. ఇది సహించలేని ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాలు టార్గెట్ చేసి మరీ ముఖ్యనేతలను చంపుతున్నారు. ఇవి ఉద్యమాలను ఆపలేవు. ఉద్యమ స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నాం' అని ఎస్ఎఫ్ఐ కేరళ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్య ప్రసాద్ తెలిపారు. ఎస్ఎఫ్ఐ మహాసభల సందర్భంగా నవతెలంగాణతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే..'మా అన్నయ్య అజయ్ ప్రసాద్ కొల్లాం జిల్లాలో ఎస్ఎఫ్ఐ విస్తరణ కోసం చురుగ్గా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ నిజస్వరూపాన్ని చెబుతూ తమ ప్రాంతంలోని విద్యార్థులను చైతన్యపరిచారు. మతతత్వ శక్తులను ఎదురొడ్డి నిలిచారు. తమ ప్రాబల్యం క్రమంగా తగ్గిపోతుండటాన్ని సహించలేని ఆర్ఎస్ఎస్ గుండాలు 2007 జూలై 20న మా అన్నయ్యను కొట్టి చంపారు. ఆయన పోరాట స్ఫూర్తితోనే నేను ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్నాను. కేరళ విద్యావిధానం దేశానికే అనుసరణీయం. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలన్నింటిలోనూ మౌలిక సదుపాయాల కల్పన బాగుంది. టీచర్ల కొరత ఎక్కడా లేదు. ఇటీవల కాలంలో ఆరు లక్షల మంది విద్యార్థులు తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఇది గొప్ప అచీవ్మెంట్. ప్రతి పాఠశాలలోనూ స్మార్ట్ క్లాస్రూమ్లున్నాయి. దేశంలోనే అత్యధిక అక్షరాస్యతను సాధించడంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వ కృషి కీలకంగా ఉంది. చిన్నప్పటి నుంచే పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించే కృషి జరుగుతున్నది. కోవిడ్ సమయంలో పిల్లల విద్యకు ఆటంకం కలుగకుండా ఆన్లైన్ క్లాసులను విద్యాశాఖ అందించింది. అందులో ఎస్ఎఫ్ఐ కూడా కీలక పాత్ర పోషించింది. సిలబస్‌ను టీవీ ఛానళ్లలో ప్రసారం చేయించింది. టీవీ సౌకర్యం లేని వాళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంలో ఎస్ఎఫ్ఐ పాలుపంచుకున్నది. చాలా మంది మొబైల్ ఫోన్లను ప్రభుత్వం అందించింది' అంటూ ఆర్యప్రసాద్ కండ్లకు కట్టినట్టు వివరించింది.