Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 47 గంటల పాటు గుహలో బండరాళ్ల మధ్య చిక్కుకొని యాతన
- 24 గంటల పాటు కొనసాగిన రెస్య్కూ ఆపరేషన్
- అధికారులు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు
నవతెలంగాణ-రామారెడ్డి
వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్యలో చిక్కుకున్న షాడ రాజు.. అధికారులు, పోలీసుల సహాయక చర్యలతో సురక్షితంగా బయటపడ్డాడు. 47 గంటల పాటు బండరాళ్ల మధ్య చిక్కుకొని నరకయాతన అనుభవించిన ఆయన.. 24 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌తో క్షేమంగా బయటపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ రాజు, మిత్రులతో కలిసి మంగళవారం అడవిలో వేటకు వెళ్లాడు. అదేరోజు దాదాపు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కన్నాపూర్ శివారులోని పులిగుట్ట గుహలోకి ప్రవేశించి, తిరిగి వస్తున్న సమయంలో గుహ బండరాళ్ల మధ్యలో చిక్కుకున్నాడు. దాంతో మిత్రులు, కుటుంబీకులు, పలువురు గ్రామస్తులు ఆయన్ను బయటకు తీసేందుకు యత్నించినా.. బయటకు రాకపోవడంతో బుధవారం మధ్యాహ్న సమయంలో పోలీసులు.. అధికారులకు సమాచారం ఇచ్చారు. బుధవారం దాదాపు మధ్యాహ్నం 3గంటలకు పోలీసులు, ఫైర్ అధికారులు, అటవీ అధికారులు, రెస్యూ టీం, వైద్యులు, ప్రతినిధుల సహకారాలతో రెస్య్కూ నిర్వహించారు. ప్రొక్లేనర్తో మట్టి, రాళ్లను తొలగిస్తున్న తరుణంలో చీకటి కావడంతో జనరేటర్ సహకారంతో లైట్లు వెలిగించి రాత్రి కూడా సహాయక చర్యలు చేపట్టారు.
పెద్దపెద్ద బండరాళ్లు అడ్డుగా ఉండటంతో సహాయక చర్యలకు అటంకం కలిగింది. నైపుణ్యత కలిగిన వ్యక్తులను కామారెడ్డి నుంచి పిలిపించి, మందు గుండు సామగ్రితో పెద్ద పెద్ద బండరాలను పగలగొట్టుతూ, ప్రొక్లేనర్ సాయంతో బండరాలను తొలగిస్తూ, సహాయ చర్యలు నిర్వహించారు. సహాయక చర్యలను జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. రాజుకు, మరో వ్యక్తి సహకారంతో, మధ్య మధ్యలో మంచినీళ్లు, పండ్ల రసాలను, పైపుల సహాయంతో అందజేశారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఎట్టకేలకు అధికారుల శ్రమ ఫలించి గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు రాజును క్షేమంగా బయటకు తీశారు. వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రాజు చేతికి, కాళ్లకు గాయాలు అయ్యాయని, 47 గంటల పాటు గుహలో చిక్కుకోవడంతో తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని, అన్ని పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తామని వైద్యులు తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది కృషితో పాటు వైద్యుల సహకారంతో నిండు ప్రాణాన్ని కాపాడామని తెలిపారు. రెస్క్యూ టీంను ఈ సందర్భంగా అభినందించారు.