Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిస్వాస్
- గుజరాత్ మోడల్ అంటే స్కూళ్ల మూసివేత...నిత్య నిర్బంధం : సత్యేషా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా మిలిటెంట్ పోరాటాలు నిర్వహిస్తామని ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిస్వాస్ హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభల సందర్భంగా గురువారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ తెచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) అంటే ఆదివాసీలు, దళితులు, మైనార్టీలు, పేద వర్గాలను విద్యకు దూరం చేసే నేషనల్ ఎక్స్‌క్లూజన్ పాలసీ అని విమర్శించారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేశారనీ, అందరికి మిడ్డే మీల్స్ అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మైనార్టీలను విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగా వారికిచ్చే ఉపకార వేతనాలను కేంద్రం రద్దు చేసిందని విమర్శించారు. ఎన్ఈపీ అమలు చేయడం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎన్ఈపీని అమలు చేయబోమంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలను మూసివేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్రంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని మయూక్ బిస్వాస్ డిమాండ్ చేశారు. 18 ఏండ్లు దాటిన యువత దేశానికి, రాష్ట్రానికి పాలకులను నిర్ణయించే ఎన్నికల్లో భాగస్వాములవుతుండగా వారు చదువుకునే ప్రాంగణాలకు సంబంధించిన నిర్ణయాల్లో భాగస్వాముల్ని చేయకపోవడమేంటని ప్రశ్నించారు. విద్యార్థి నాయకత్వం ఎదగకుండా చేయాలనకుంటే భవిష్యత్తులో దేశానికి నాయకుల కొరత ఏర్పడుతుందని హెచ్చరించారు. కేవలం విద్యను పూర్తి చేసుకుని డాక్టర్లు, ఇంజినీర్లు తదితరులు మాత్రమే ఉంటారని తెలిపారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా క్యూబా చేస్తున్న పోరాటానికి సంఘీభావం ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
గుజరాత్ మోడల్ అంటే...
స్కూళ్ల మూసివేత...విద్యార్థులపై నిర్బంధం
గుజరాత్ మోడల్ అంటే స్కూళ్ల మూసివేత, నిరుద్యోగ యువత ఆత్మహత్యలు, మైనార్టీలకు స్కూళ్లలో ప్రవేశాల నిరాకరణ, ఉద్యోగ పరీక్షల పేపర్ల లీకేజీ, మహిళలపై అత్యాచార బాధ్యులకు శిక్షలు పడకపోవడం, నిత్య నిర్బంధమని ఎస్ఎఫ్ఐ గుజరాత్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, కేంద్ర కార్యవర్గ సభ్యులు సత్యేషా విమర్శించారు. ఆ రాష్ట్రం వికాస్ మోడల్ అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారమంతా వట్టిదేనని ఆమె కొట్టిపారేశారు. గత రెండేండ్ల కాలంలో విలీనం పేరుతో ఆరు వేల స్కూళ్లను మూసేశారని తెలిపారు. మైనార్టీలకు పాఠశాలల్లో ప్రవేశాలను నిరాకరిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాల కోసం చదువుకున్న అభ్యర్థులకు పేపర్ల లీకేజీ పెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 13 సార్లు పేపర్లు లీకయ్యాయంటే అక్కడి ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా పని చేస్తున్నదో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలు పెరిగాయని తెలిపారు. ఎస్సీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల సమయంలో స్మార్ట్ ఫోన్ల సమస్య, పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వంటివి ఎదురవుతున్నాయని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయకుండా తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం కావడం, గుజరాత్ మోడల్ దేశమంతా అమలు చేస్తామంటూ 2014లో బీజేపీ కేంద్రంలో తొలిసారి అధికారంలోకి రావడం, గుజరాత్లో వాస్తవ పరిస్థితి దేశానికి తెలిస్తే బీజేపీ చెప్పే అబద్ధాల ప్రచారం దేశ ప్రజలకు అవగతమవుతుందని భయపడుతున్నదని తెలిపారు. ఈ భయం కారణంగా అక్కడి విద్యార్థులు నిరసన తెలపకుండా, నిరసన తెలిపినా ఆ విషయాలు ప్రచారంలోకి రాకుండా ఆంక్షలను విధిస్తుందని చెప్పారు. మహిళల రక్షణ ఎండమావిగా మారిందన్నారు. అత్యాచార బాధ్యులను అక్కడి ప్రభుత్వమే బ్రాహ్మణులు సంస్కారవంతులంటూ శిక్షలు పడకుండా వదిలేస్తూ అలాంటి వారికి అండగా నిలబడుతున్నదని తెలిపారు.
నిర్బంధానికి మారు పేరు జమ్ముకాశ్మీర్
జమ్ముకాశ్మీర్‌లో అన్నింటిపై నిర్బంధం కొనసాగుతున్నదని ఎస్ఎఫ్ఐ జమ్ముకాశ్మీర్ రాష్ట్ర కార్యదర్శి ఆకూబ్ యూసుఫ్ తెలిపారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత పరిస్థితి మరింత దిగజారిందన్నారు. ఫోన్లు, ఇంటర్నెట్ కట్ చేయడం దగ్గర నుంచి విద్యార్థి కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తున్నారని తెలిపారు. ఆ పరిమితుల మధ్య కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తున్నదని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎస్.కె.జాన్ భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు పాల్గొన్నారు.