Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులను ఆకర్షించిన 'అందర్-బాహర్'
- ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభ సందర్భంగా ఓయూలో..
నవతెలంగాణ-ఓయూ
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యావిధానంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వారి ప్రోగ్రెసివ్ థియేటర్ గ్రూప్ ఆధ్వర్యంలో ''అందర్ -బాహర్ వీధి నాటిక''ను ప్రదర్శించారు. ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభల సందర్భంగా గురువారం రాత్రి ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ప్రదర్శించిన ఈ నాటకానికి విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే రైల్వేలు, బీఎస్ఎన్ఎల్, విశాఖ స్టీల్‌తోపాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేసిందని ఈ నాటకం ద్వారా తెలిపారు. అలాగే, నూతన జాతీయ విద్యావిధానం ద్వారా పూర్తిగా విద్యను పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు పూనుకుందని వివరించారు. ఈ నూతన విద్యావిధానం ద్వారా రిజర్వేషన్, ఫెలోషిప్, సామాజిక న్యాయం ఉండదని స్పష్టం చేశారు. మరొక వైపు మునువాదాన్ని విద్యాసంస్థల్లో చొప్పించేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలను వారు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నట్టు నాటకం ద్వారా కండ్లకు కట్టినట్టు చూపించారు.అంతకుముందు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మాజీ నేతలు వీరయ్య, రాములు, ఓయూ ప్రొఫెసర్ డా.నాగేశ్వర్రావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి మాట్లాడారు. ఓయూ వేదికగా ఎన్నో చరిత్రాత్మక ఉద్యమాలు జరిగాయన్నారు. అదే స్ఫూర్తితో నూతన జాతీయ విద్యా విధానం అమలు కాకుండా చూడాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఇప్పుడే ఉన్నత విద్యా రంగాల్లో రాణిస్తున్న వెనుకబడిన వర్గాలను మళ్లీ విద్యకు దూరం చేసి, వారి వారి గత వృత్తులకే పరిమితం చేయాలని బీజేపీ యోచిస్తోందన్నారు.
విద్యార్థులు విద్యారంగ పరిరక్షణకు ఉద్యమించాలని.. అందుకు ఎస్ఎఫ్ఐ 17వ మహాసభ వేదికగా తీర్మానాలు చేస్తోందన్నారు. అనంతరం, ఇటీవల అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలిచిన విద్యార్థులు సంధ్య, స్వప్నిల్, సుప్రియ, గణేష్‌కు బహుమతులు అందజేశారు. నాటికను ప్రదర్శించిన వారిలో జాన్ బషీర్, కిర్ప, అభిషేక్ నందన్, శిరీష, నవమి, అభిషేక్, గిరీష్ బాబు, శివ, అజరు, ఔరిస్మిత ఉన్నారు. ఎస్ఎఫ్ఐ ఓయూ అధ్యక్షుడు ఆంజనేయులు, కార్యదర్శి రవి నాయక్, అనంత్ శర్మ,శ్రవణ్, అరవింద్, మమత, నవీన్ పాల్గొన్నారు.