Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూబా విద్యార్థి సంఘం నేత మెలినా లోహజ్
నవ తెలంగాణ:ప్రజాస్వామ్య సమాజం కోసం విద్యార్ధులు, అభ్యుదయవాదులు పోరాడాలని క్యూబా విద్యార్థి సంఘం నేత మెలినా లొహాజ్ అన్నారు. క్యూబాలో శాస్త్రీయ విధానంలో విద్య బోధన జరుగుతుందని చెప్పారు. ఆనేక సవాళ్లను ఎదుర్కొని విద్యావ్యవస్థను మెరుగుపర్చుకున్నామన్నారు. కరోనా కాలంలో అనేక సేవా కార్య క్రమాలను చేపట్టామన్నారు. నైతిక విలువలను ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. తమ దేశంలో ఉపాధి కల్పన మెరుగ్గానే ఉందన్నారు. విద్యావిధానంలో నియంతృత్వ పోకడలు ఏదేశానికైనా మంచిది కాదన్నారు. విద్యారంగ పరిరక్షణ, సామ్యవాద స్థాపన దిశగా విద్యార్ధి సంఘాలు సమాలోచనలు చేయాలని కోరారు.
అభ్యుదయ నాయకత్వం ప్రపంచమంతటా విస్తరించాలి
బంగ్లాదేశ్ స్టూడెంట్ యూనియన్(బీఎస్యూ) ప్రధాన కార్యదర్శి దీపక్సేన్
ప్రపంచమంతటా అభ్యుదయ నాయకత్వం బలపడుతోందని బంగ్లాదేశ్ స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దీపక్సేన్ ఆకాంక్షించారు. సోషలిజం రావాలని తాము కోరుకుంటున్నామన్నారు. చారిత్రాత్మకంగా చూస్తే భారత్, బంగ్లాదేశ్ మూలాలు ఒక్కటేనన్నారు. ఇక్కడ విద్యార్థి ఉద్యమాలపై అణచివేత ఎలా ఉందో తమ దేశంలోనూ అలాగే ఉందని చెప్పారు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న ఎస్ఎఫ్ఐకి అభినందనలు
స్టూడెంట్ యూనియన్ ఆఫ్ బంగ్లాదేశ్(ఎస్యూబీ) ప్రధాన కార్యదర్శి అదితి
విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న ఎస్ఎఫ్ఐకి అభినందనలు తెలుపుతున్నట్టు స్టూడెంట్స్్ యూనియన్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్రధాన కార్యదర్శి అదితి చెప్పారు. బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమంలో తమ సంఘం కీలక పాత్ర పోషిస్తున్నదని చెప్పారు. ప్రయివేటీకరణతో విద్య ఖరీదైపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ఎలాగైతే ఉద్యమాలను అణచివేస్తున్నారో తమ దగ్గరా అదే పరిస్థితి ఉందని చెప్పారు. విద్యార్థుల హక్కులు హరించవేయ బడుతున్నాయ న్నారు. బంగ్లాదేశ్ విద్యావ్యవస్థలో చాలా సమస్యలున్నాయని, విద్యారంగంపై అక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని చెప్పారు. అనాలోచిత విద్యావిధానాల వల్లే నిరుద్యోగ సమస్య పెరుగుతోందని చెప్పారు. ''ఎడ్యుకేషన్ ఫర్ ఆల్..ఎంప్లాయిమెంట్ ఫర్ ఆల్..యునైటెడ్ ఫర్ ఆల్'' నినాదంతో ముందుకెళ్తున్న ఎస్ఎఫ్ఐకి అభినందనలు తెలిపారు.
సమానత్వం కోసం కొట్లాడుతున్నాం
పాలస్తీనా బిడిఎస్ నేత అపూర్వ గౌతమ్
తమ దేశంలో సమానత్వం కోసం పోరాడుతున్నామని పాలస్తీనా, బిడిఎస్ నేత అపూర్వ గౌతమ్ తెలిపారు. ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలకు విప్లవాభివందనాలు తెలిపారు. తమ దేశంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉంటూ మానవ హక్కుల కోసం పోరాడుతున్నామన్నారు. పాలస్తీనాలో ఇంకా చాలా సమస్యలున్నాయన్నారు. ప్రపంచమంతా వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాలు బలపడాలని ఆకాంక్షించారు. ఎన్ఈపీకి వ్యతిరేకంగా బలమైన పోరాటాలు చేయాలని సూచించారు.
ఎస్ఎఫ్ఐ మహాసభల్లో భారత విద్యారంగ పరిరక్షణకు నిర్ణయాలు జరగాలని.. ప్రజాస్వామ్యం,సామ్యవాదం నినదించాలని ఆకాంక్షింస్తూ పలు దేశాలకు చెందిన విద్యార్ధి సంఘాల నేతలు పంపిన వీడియో సందేశాలను మహాసభలో ప్రదర్శించారు.