Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో రోజూ ఆశాల ధర్నా
- కనీస వేతనం రూ.26వేలు.. అదనపు పనికి అదనపు వేతనం
- సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
నవతెలంగాణ- విలేకరులు
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా కార్యకర్తలు చేపట్టిన 48 గంటల నిరవధిక ధర్నాలో భాగంగా రెండోరోజు శుక్రవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపారు. టీబీ పరీక్షకు సంబంధించి తెమడ (స్పుటమి) సేకరణ విధులను రద్దు చేయాలి.. స్పెషల్ - ప్రత్యేక కార్యక్రమాల సందర్భంగా నిర్వహిస్తున్న సర్వేలకు, ఇతర కార్యక్రమాలకు అదనంగా పారితోషికాలు చెల్లించాలి. పెండింగ్ బిల్లులన్నీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంటింటికీ తిరిగి ఆశాలు సర్వే చేయాలని అధికారులు చెబుతున్నారని, కానీ డబ్బులేమీ లేవని, ఉచితంగా చేయాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టం చేయించుకుని డబ్బులు ఇవ్వకపోతే ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం అమలు చేసేవరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్నట్టు ఇక్కడా ఫిక్స్డ్ వేతనం రూ.10,000 చెల్లించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వంటావార్పు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిర్మల్లోనూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. మంచిర్యాలలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పెరిగిన ధరలకనుగుణంగా ఆశాలకు కనీస వేతనం ఇవ్వాలని, ఈ లోపు ఫిక్సిడ్ వేతనం చెల్లించాలని, అదనపు పనులకు అదనపు పారితోషికం చెల్లించాలని కలెక్టర్ కార్యాలయంలో వినతపత్రాన్ని అందించారు. ఆశాల సమస్యలను పరిష్కరిం చాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. మేడ్చల్ జిల్లాలో కమలానగర్ సీఐటీయూ కార్యాలయం నుంచి ఈసీఐఎల్ చౌరస్తా వరకు ఆశా కార్మికులు ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ మేడ్చల్ జిల్లా కార్యదర్శి జై.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆశా కార్మికులను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.