Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సివిల్ సప్లైస్, జీసీసీ హమాలీ వర్కర్స్ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమ్మెను మరింత ఉధృతంగా కొనసాగించనున్నట్టు తెలంగాణ సివిల్ సప్లైస్ హమాలీ వర్కర్స్ జేఏసీ (సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ) ప్రకటించింది. 2022, 2023 సంవత్సరాలకు సంబంధించి ఎగుమతి, దిగుమతి రేట్లపై జరిగిన ఒప్పందం ప్రకారం...నూతన రేట్లను ఎరియర్స్‌తో సహా చెల్లించాలనీ, హమాలీ కార్మికులందరికి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 14 నుంచి సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సివిల్ సప్లై కమిషనర్ ఆహ్వానం మేరకు జేఏసీ నాయకులు వంగూరి రాములు, పాలడుగు సుధాకర్ (సీఐటీయూ), కె.సూర్యం (ఐఎఫ్ టీయూ) చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్, కూలీ రేట్లకు సంబంధించి ఆర్థిక శాఖ తుది జీవోను రెండ్రోజుల్లో ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, డిసెంబర్ 17 లేదా 19న ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేస్తామనీ, తక్షణమే సమ్మె విరమించాలని కోరారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ, జీవో విడుదల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అయితే 12 నెలలు గడిచినా రేట్ల అమలు జరగకపోవడంతో రెండు నెలల ముందే సమ్మె నోటీస్, వినతులు ఇచ్చినా ప్రభుత్వ పట్టించుకోలేదని ఆక్షేపించారు. సమ్మెకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తెలిపారు. తక్షణమే జీవో విడుదల చేయాలనీ, కూలీ రేట్లను 2022 జనవరి నుంచి ఏరియర్స్‌తో సహా చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు, స్పష్టమైన హామీతో పాటు పెరిగిన రేట్లకు సంబంధించిన ఏరియర్స్ ను ఎప్పటిలోగా చెల్లిస్తారో తెలిపే వరకు సమ్మె కొనసాగుతుందని చెప్పారు.