Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13,000 ప్రభుత్వ పాఠశాలల్లో కార్యక్రమాలు : శైల తాళ్లూరి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రుతుక్రమంపై విద్యార్థినీలు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని స్వచ్ఛంద సేవా సంస్థ పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ (ప్యూర్) సీఈఓ శైల తాళ్లూరి సూచించారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో ఆరు వేలు, ఆంధ్రప్రదేశ్లో ఏడు వేల ప్రభుత్వ పాఠశాలల్లో రుతుక్రమ అక్షరాస్యతతో పాటు కెరీర్ గైడెన్స్ అవగాహనా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. 26 లక్షల మంది విద్యార్థినీలు లాభపడనున్నట్టు చెప్పారు. మహిళలు 15 ఏండ్ల నుంచి 55 ఏండ్ల వరకు ఏడేండ్ల కాలం లేదా 2,555 రోజులు రుతుక్రమ కాలంలో ఉంటారని తెలిపారు. సగటున ఒక మహిళ తన జీవితకాలంలో పదో వంతు ఉండే ఈ కాలానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థి దశ నుంచి అవగాహన కలిగి ఉండటం అవసరమన్నారు. ఈ కాలానికి సంబంధించి అవగాహనలేమి కారణంగా బాలికల చదువులకు ఆటంకం ఏర్పడటానికి వీల్లేదనీ, ఆ దిశగా తమ అవగాహనా కార్యక్రమాలు ఉండబోతున్నాయని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసినట్టు చెప్పారు. స్వచ్ఛంద సేవా సంస్థ నిర్మాణ్ సీఈఓ మయూర్ పట్నాల మాట్లాడుతూ విద్యార్థులకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు 600కు పైగా అవకాశాలుండగా, వారంతా 10 లోపు మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారని తెలిపారు. కెరీర్ గైడన్స్ తక్షణావసరమని అభిప్రాయపడ్డారు. 26 లక్షల మందిని చేరుకునే క్రమంలో పలువురిని భాగస్వాములు చేసుకుంటామని తెలిపారు.