Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎమ్మెల్యేలను కొనేందుకు కుట్ర చేశారనే కేసును సీబీఐకివ్వాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, సిట్ కేసులో నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి, తుషార్, జగ్గుస్వామి వేర్వేరుగా వేసిన ప్రధాన రిట్లపై తీర్పును వాయిదా వేసిన హైకోర్టు శుక్రవారం అనుబంధ పిటిషన్లపై కూడా తీర్పును రిజర్వులో పెట్టింది. సీఎం మీడియా సమావేశంలో వీడియోలను ప్రదర్శించారంటూ వాటిని నివేదిస్తూ వేసిన అనుబంధ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ విజరుసేన్‌రెడ్డి శుక్రవారం విచారణ పూర్తి చేశారు. తీర్పును తర్వాత చెబుతామని చెప్పారు. ఆ వీడియోలను సీఎంకు తానివ్వలేదనీ, తనకు సిట్ కూడా ఆ వీడియోలు ఇవ్వలేదని కేసు పిర్యాదుదారు, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తరఫు న్యాయవాది చెప్పారు. ఫిర్యాదుదారు ఇచ్చి ఉంటారని సిట్ తరపు అదనపు ఏజీ చెప్పారని హైకోర్టు తెలిపింది. ఆ విధంగా రోహిత్‌రెడ్డి ఇవ్వలేదని లాయర్ చెప్పారు. అనుబంధ పిటిషన్‌తో జత చేసిన వీడియోలను పరిగణనలోకి తీసుకోరాదని ప్రభుత్వం కోరింది. వాదనల తర్వాత హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ తనకు 41ఎ నోటీసు ఇచ్చిందనీ, తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కేరళ డాక్టర్ జగ్గు కొట్టిలిల్ (జగ్గుస్వామి) సోదరుడు మణిలాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సిట్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను న్యాయమూర్తి జస్టిస్ చిల్లకూరు సుమలత శుక్రవారం ఆదేశించారు. విచారణను 23కి వాయిదా వేశారు.
మార్గదర్శిలో సోదాలపై స్టే
మార్గదర్శి చిట్‌ఫండ్ ఆఫీసుల్లో ఏపీ పోలీసుల సోదాలు నిర్వహించడంపై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 23వ తేదీన తిరిగి విచారిస్తామనీ, అప్పటి వరకు స్టే ఉత్తర్వులు అమల్లో ఉండాలని న్యాయమూర్తి జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చిన ఉత్తర్వులను మార్గదర్శి హైకోర్టులో సవాల్ చేసింది. విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.