Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. ఆ సభలో నడ్డా డైలాగుల కోసం పాకులాడారని ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్కు వీఆర్ఎస్ అంటే తమకు ఓటమి లేదని నడ్డా అంగీకరించినట్టేనని వ్యాఖ్యానించారు. వీఆర్ఎస్ అంటే స్వచ్ఛంద విరమణ... మేం ఆ రకంగా స్వచ్ఛంద విరమణ చేస్తే తప్ప బీఆర్ఎస్కు ఓటమి లేదంటూ నడ్డానే అంగీకరించారని హరీశ్‌రావు విమర్శించారు. 'మీరేం హామీలు నెరవేర్చారని.. మా గురించి మాట్లాడుతున్నారు. రైతుల ఆదాయం పెంచుతామని చెప్పి పెట్టుబడిని రెట్టింపు చేశారు. రూ.లక్షల డబ్బు ఖాతాల్లో వేస్తామన్నారు, కోట్ల కొద్దీ కొలువులిస్తామన్నారు.. అవన్నీ ఏవీ? ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్రంలో కల్యాణలక్ష్మీ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో చెప్పలేదు కదా.. అయినా మేం ఇచ్చాం. రైతుబంధు, రైతుబీమా ఇస్తామని కూడా చెప్పలేదు. మేనిఫెస్టోలో లేకపోయినా కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. ఆ పథకం అద్భుతమంటూ కేంద్రమే రెండు అవార్డులు ఇచ్చింది. బీజేపీకి ఎంతసేపు రాజకీయాలు తప్ప అభివృద్ధి ధ్యాస లేదు. కేసీఆర్ మాత్రం ప్రతి నిమిషం ప్రజల కోసం ఆలోచిస్తారు. అందులో భాగంగానే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అవన్నీ అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో చేసుకుంటూ పోతున్నాం' అని హరీశ్‌రావు ఈ సందర్భంగా నడ్డాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.