Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జవహర్‌నగర్‌లో అదృశ్యమైన చిన్నారి మృతి
- కిడ్నాప్ చేసి చంపారని కుటుంబసభ్యుల ఆందోళన
- న్యాయం చేయాలని రోడ్డుపై బైటాయింపు
నవతెలంగాణ-జవహర్‌నగర్
చిన్నప్పటి నుంచే చదువుల్లో, ఆటల్లో చురుకుగా ఉంటూ అల్లారు ముద్దుగా పెరిగిన ఆ చిన్నారి ఇక లేదన్న చేదు నిజాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ''తల్లీ నీవు లేక మేము ఉండలేం.. లే అమ్మా ఇందు'' అంటూ గుండెలవిసేలా తల్లిదండ్రులు ఏడుస్తుంటే అక్కడికి వచ్చిన వారూ తట్టుకోలేకపోయారు. హైదరాబాద్ జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని అంబేద్కర్‌నగర్ ఎన్టీఆర్నగర్ కాలనీలో గురువారం అదృశ్యమైన చిన్నారి అనుమానాస్పద స్థితిలో చెరువులో శవమై తేలింది. వివరాల్లోకెళ్తే.. నరేష్ కూలీ పనులు చేసుకుంటూ భార్య లక్ష్మి, కుమారుడు, ఇద్దరు కూతుర్లతో కలిసి ఎన్టీఆర్నగర్ కాలనీలో నివసిస్తున్నాడు. చిన్న కుమార్తె ఇందు(10)ను తండ్రి గురువారం దమ్మాయిగూడలోని ప్రభుత్వ పాఠశాలలో వదిలిపెట్టి వెళ్లాడు. అనంతరం.. ఇంకా సమయం ఉందని, ప్రాంగణంలో ఆడుకుంటానని ఇందు స్నేహితులకు చెప్పి తరగతి గది నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దాంతో చిన్నారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. బాలిక ఆచూకీ కోసం గాలించారు. ఈ క్రమంలో అంబేద్కర్‌నగర్ చెరువులో చిన్నారి మృతదేహం లబ్యమైంది. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
దమ్మాయిగూడ ప్రధాన చౌరస్తా వద్ద కుటుంబసభ్యుల ఆందోళన
పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే, తమకు న్యాయం చేయాలంటూ దమ్మాయిగూడ ప్రధాన చౌరస్తా వద్ద కుటుంబసభ్యులు, బంధువులు, ప్రజాసంఘాల నాయకులు నిరసనకు దిగారు. బాలికను కిడ్నాప్ చేసి హత్య చేశారని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ గంజాయి సేవించే ఆగంతకుల పనేనని ఆరోపించారు. చెరువు పక్కన నిర్మానుష్య ప్రాంతం కావడంతో అది గంజాయి సేవించే వారికి ఆవాసంగా మారిందని, నిందితులను వెంటనే పట్టుకుని ఇందు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారితో మాట్లాడారు. అనంతరం ఇందు దహన సంస్కారాలను కుటుంబ సభ్యులు పూర్తి చేశారు.
చిన్నారి ఇందు మృతిపై విచారణ జరపాలి
దోషులను కఠినంగా శిక్షించాలి :ఐద్వా డిమాండ్
మేడ్చల్ జిల్లా పరిధిలోని దమ్మాయిగూడకు చెందిన చిన్నారి ఇందు అనుమానస్పద మృతిపట్ల అఖిల భారత ప్రజాతత్ర మహిళా సంఘం (ఐద్వా) సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం ప్రతినిధి బృందం బాధిత కుటుంబ సభ్యులతో కలిసి దమ్మాయిగూడ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ చిన్నారి మృతి ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలనీ, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.బాధిత కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు, ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోజురోజుకు చిన్నారులపై, మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయనీ, వాటిని అరికట్టడంలో పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.