Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాసమ్మేళానికి పూర్వవిద్యార్థుల దన్ను
- నాటి జ్ఞాపకాలు... నేటికీ స్ఫూర్తిదాయకం
- ఉరకలేస్తున్న యువ కెరటాలకు తోడు, నీడై ఎత్తిన జెండా దించలే...
- ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభల్లో మధుర స్మృతులు
గుడిగ రఘు
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఉద్యమ ప్రయాణంలో గతంలో పాలుపంచుకున్న పూర్వ విద్యార్థి నాయకుల్లో ఉన్న ప్రేరణ నేటికి స్పూర్తి దాయకంగా నిలిచింది. నాలుగు దశాబ్ధా ల అనుబంధాన్ని వారు నెమరు వేసుకు న్నారు. మది నిండా నింపుకున్న ఆ నాటి జ్ఞాపకాలను కొత్త తరం నేతలతో పంచుకున్నారు. అదే స్ఫూర్తితో ఎస్ఎఫ్ఐ మహాసమ్మేళానికి పూర్వ విద్యార్థులు వెన్నుదన్నుగా నిలిచారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తాతా మధు, టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు జి రాంబాబు యాదవ్, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ఖదర్, ప్రొఫెసర్లు కె నాగేశ్వర్, చెన్న బసవయ్య, డాక్టర్ వి కృష్ణ, కేయూ వీసీ రమేష్్ సైతం హాజరై పూర్వ విద్యార్థులను ఉత్సహపరిచారు. ఉద్యమం అంటే పూలపాన్పు కాదనీ, కష్టాలు, కన్నీళ్లు ఉంటాయనీ, వాటిని ఎదుర్కొని నిలబడాలని తమ అనుభావాలను వివరించారు. పూర్వవిద్యార్థి నాయకులు జి బుచ్చిరెడ్డి, ఎం శ్రీనివాస్, జేకే శ్రీనివాస్, ఎన్ సోమయ్య, గుడిగ రఘు, దశరథం, విజరు, రాధిక, హైదరాబాద్ నగర నాయకులు జావెద్, అశోక్‌రెడ్డి, లెనిన్ తదితరులు విద్యార్థుల సమ్మేళనానికి శ్రీకారం చుట్టారు. మహాసభల నేపథ్యంలో పూర్వ విద్యా ర్థుల సమ్మేళనం ఇటీవల హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. విద్యార్థి దశ అనంతరం ఉద్యోగ, వ్యాపార రంగాలు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, పోలీసులు, డాక్టర్ల వృత్తిల్లోనూ స్థిరపడిన పూర్వ విద్యార్థి నేతలు హాజరయ్యారు. వారంత ఎస్ఎఫ్ఐ రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వారే. అనివార్య పరిస్థితుల్లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించినప్పటికీ తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఉద్యమ సంస్థను మరచిపోలేదు. ఏ హోదాలో ఉన్నప్పటికీ తమ రాజకీయ పునాదికి బాటలు వేసిన ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు హైదరాబాద్‌లో జరిగిన నేపథ్యంలో 'మేము సైతం...ఎస్ఎఫ్ఐ కోసం' అంటూ ముందు కొచ్చారు. ఉరకలేస్తున్న యువ కెరటాలకు తోడు, నీడై నిలిచారు. విద్యార్థి సమస్యలపై నిజాయితీగా ఉద్యమిస్తున్న ఎస్ఎఫ్ఐ...తమ జీవితాలు సక్రమ మార్గంలో నడిచేందుకు దారి చూపిందంటూ తమ బాల్య దశను గుర్తు చేసుకున్నారు. కొంత మంది నాయకులు ఆ నాటి నిర్భందాలను, పాలకుల అణచివేత, దాడులకు ఎదురొడ్డి నిలిచిన విషయాలను గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మనుషుల మధ్య అనుబంధాలను, కమ్యూనిస్టు విలువలను నూరిపోయడంలో ఎస్ఎఫ్ఐ మించిన సంస్థ లేదంటూ గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో మహాసభల విజయవంతం చేయడంలోనూ పరోక్షంగానూ, ప్రత్యేకంగానూ ఆర్థిక, హార్థిక సహాయ, సహకారాలు అందించారు. మరికొంత మంది పూర్వ విద్యార్థి నాయకులు మహసభలకు వాలంటీర్లుగా విధులు నిర్వహించి, యువ కెరటాలకు స్ఫూర్తి నింపారు. ఇక ముందు జరగబోయే విద్యార్థి ఉద్యమాలకు తాము అండగా ఉంటామని ప్రతినబూనారు.