Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో బీజేపీని తరిమికొట్టాలి
- వరంగల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ - మట్టెవాడ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి సీపీఐ(ఎం)కు పునర్ వైభవం తీసుకురావాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఉర్సుగుట్ట ప్రాంతంలోని రామ నరేందర్ భవన్లో శుక్రవారం జరిగింది. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నలుగంటి రత్నమాల అధ్యక్షతన జరిగిన సమావేశంలో తమ్మినేని. జి.నాగయ్య, హాజర య్యారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. దేశంలో కులాలు,మతాల వారీగా చిచ్చులు పెట్టి ప్రజల మధ్య ఆగాధం సృష్టిస్తున్న బీజేపీని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందుకు కమ్యూనిస్టులు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడేది కమ్యూనిస్టులు మాత్రమేనని తెలిపారు. ,కమ్యూనిస్టుల బలం ఏంటో తెలిసే ముఖ్యమంత్రి కేసీఆర్ మన మద్దతు తీసుకొని మునుగోడులో గెలిచారని గుర్తుచేశారు. తెలంగాణలో పేద ప్రజల అవసరాలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లామని, ప్రభుత్వ స్థలాల్లో నిరుపేదలు వేసుకున్న ప్రతి ఒక్క గుడిసెకు పట్టాలిచ్చి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీఎంను కోరగా సానుకూలంగా స్పందించినట్టు తెలియజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున భూ పోరాటాలు జరుగుతున్నాయని అభినందించారు. సిద్దిపేటలో జరిగే సీఐటీయూ రాష్ట్ర మహాసభలు, ఖమ్మంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
దేశం కమ్యూనిస్టుల వైపు చూస్తోంది : నాగయ్య
ప్రధాని మోడీ అధికారంలోకి రాకముందు ఎన్నో మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల డబ్బు పంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చాక అదే నల్లడబ్బును పోగుచేసుకునేందుకు కార్పొరేట్లకు మార్గం మరింత సుగమం చేశారని మండిపడ్డారు. బతకలేనంతగా నిత్యావసర ధరలు పెంచి దోచుకుంటున్నారని, అందుకే ప్రజల చూపు కమ్యూనిస్టుల వైపు ఉన్నదని తెలిపారు. వరంగల్ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషిచేయాలని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీశ్ కుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య సమ్మన్న, కుమారస్వామి, సింగారపు బాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముక్కేర రామస్వామి, జిల్లా కమిటీ సభ్యులు మాలోతు సాగర్, ఆరూరి కుమార్, సాయన్న, శ్రీధర్, స్వామి, వెంకన్న, గుజ్జుల ఉమా, బొల్ల సాంబయ్య, అక్కినేపల్లి యాదగిరి, ఎండీ బషీర్, తదితరులు పాల్గొన్నారు.