Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ ప్రతినిధులకు వాలంటీర్ల సపర్యలు
- ఎక్కడా లోటు రాకుండా జాగ్రత్తలు
- డెలిగేట్లకు ఆహారం వడ్డించిన ఎమ్మెల్సీ అలుగుబెల్లి
అచ్చిన ప్రశాంత్
ఉద్యమాల గడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎస్ఎఫ్ఐ అఖిల భారత 17వ మహాసభలు విజయవంతంగా ముగిశాయి. హైదరాబాద్లో ఆయా రాష్ట్రాల ప్రతినిధులు అడుగుపెట్టినప్పటి నుంచి వారు తిరుగు ప్రయాణమయ్యే వరకు సదా మీ సేవలో అంటూ 300 మంది వాలంటీర్లు సేవలందించారు. ఏ చిన్న లోటూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మహాసభల ప్రతినిధుల మన్ననలు పొందారు. మహాసభల జయప్రదం కోసం 11 కమిటీలు సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగాయి. ప్రతినిధుల సభ చివరిరోజైన శుక్రవారం నాడు ఎమ్మెల్సీ, ఆహ్వానసంఘం చైర్మెన్ అలుగుబెల్లి నర్సిరెడ్డి డెలిగేట్లకు స్వయంగా భోజనం వడ్డించడం గమనార్హం. ఆయా రాష్ట్రాల ప్రతినిధులను ఆప్యాయంగా పలుకరించారు. ఆహ్వానసంఘం కమిటీ కో చైర్మెన్ ఎం.శ్రీనివాస్, ప్యాట్రన్ వీరయ్య పర్యవేక్షణలో కమిటీలు పనిచేశాయి. ఫుడ్కమిటీకి కె.ఈశ్వర్రావు, పబ్లిసిటీ కమిటీకి ఎం.మహేందర్, పబ్లిక్మీటింగ్ కమిటీకి ఎం.దశరథ్, మెడికల్ కమిటీకి అప్రోజ్, హాల్కమిటీకి నాగలక్ష్మి, ట్రాన్స్పోర్టు కమిటీకి కె.ఎన్.రాజన్న, అతిథులను రిసీవ్ చేసుకునే కమిటీకి జె.కుమారస్వామి, గెస్టుల కమిటీకి వి.కామేశ్బాబు, వాలంటీర్ కమిటీకి ఎం.వెంకటేశ్, మీడియా కమిటీకి జావిద్, వసతికల్పన కమిటీకి ఎం.శ్రీనివాస్ నేతృత్వం వహించారు. నెల రోజుల ముందు నుంచే ఆయా కమిటీలు పనుల్లోకి వెళ్లిపోయాయి. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఆయా ప్రజాసంఘాల వాళ్లు ఆయా కమిటీలకు బాధ్యత వహించారు. మహేందర్ నేతృత్వంలోని పబ్లిసిటీ కమిటీ హైదరాబాద్లో పలు ముఖ్యమైన ప్రాంతాల్లో తోరణాలు, జెండాలతో అలంకరణ చేయడంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యమైన ప్రదేశాల్లో వాల్రైటింగ్ చేయించింది. మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ..పురాతనకాలంలోనే ప్లాస్టిక్ సర్జరీలు, విమానాలున్నాయని వాదించే వారికి కౌంటర్ ఇచ్చేలా, సైన్స్యే వాస్తవం అని చెప్పేలా ఓయూలో పలుచోట్ల ఐన్స్టీన్, న్యూటన్, తదితర గొప్ప శాస్త్రవేత్తలను స్మరించుకుంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ చరిత్రను కొన్ని శక్తులు వక్రీకరించే పనిచేస్తున్న క్రమంలో తెలంగాణ సాయుధ పోరాటంలోని మహనీయుల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. తెలుగు గడ్డ సాహిత్యప్రియుల అడ్డా అని చెప్పేలా శ్రీశ్రీ, కాళోజీ, దాసరి రంగాచార్యులు, వేమన తదితర కవులను స్మరించుకుంటూ వారి ఫోటోలను ఆకర్షించేలా ప్రత్యేక ఫ్రేమ్లను ఏర్పాటు చేసింది. మహాసభల ప్రాంగణంలో మాకు స్ఫూర్తినిచ్చే నాయకులు వీరే అంటూ.. పుచ్చలపల్లి సుందరయ్య, జ్యోతిబాఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పెరియార్, మారడోనా, మల్లుస్వరాజ్యం, రవీంద్రనాధ్ఠాగూర్, ఫెడల్కాస్ట్రో, బిర్సాముండా, రోహిత్వేముల, అభిమన్యు, ధీరజ్, అనిశ్ఖాన్, తదితరుల ఫొటోలను ఏర్పాటు చేశారు.
ఆహా ఏమి రుచీ...మైమరిచితిమి..
రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులకు నాలుగు రోజుల పాటు నాణ్యతతో కూడుకున్న రుచికరమైన భోజనాన్ని ఆహ్వాన సంఘం అందించింది. ప్రత్యేకంగా 25 మంది పాకశాస్త్ర నిపుణులు తమ చేతివంటలను ప్రతినిధులకు రుచి చూపించి మైమరిపించారు. ఉత్తరాది రాష్ట్రాల వారి కోసం రోటీ చేస ిపెట్టారు. శాఖాహార, మాంసాహార వంటకాలను అందుబాటులో ఉంచారు. చేసిపెట్టారు. ఒకేసారి ఏడొందల మంది వచ్చినా భోజనం వడ్డించేలా ఐదు కౌంటర్లను ఏర్పాటు చేశారు. భోజనం వడ్డించేందుకే ప్రత్యేకంగా 85 మంది పనిచేశారు.
మెడికల్ సేవలు అమోఘం
మహాసభల ప్రాంగణంలో నాలుగురోజుల పాటు నాగేశ్వర్రావు నేతృత్వంలోని పదిమందితో కూడిన మెడికల్ టీమ్లు విడతలవారీగా వైద్య సేవలను అందించాయి. నాలుగు రోజుల కాలంలో 620 మందికిపైగా ప్రతినిధులు వైద్య సలహాలు, చికిత్సలు పొందారని కన్వీనర్ అఫ్రోజ్ తెలిపారు. ఇద్దరు ముగ్గురికి ఆస్పత్రిలో వైద్యం అవసమైతే తీసుకెళ్లారు.
ప్రతినిధుల తరలింపులో ఆర్టీసీ సేవలు
ప్రతినిధులను మహాసభల ప్రాంగణం నుంచి వసతి ప్రదేశాలకు తరలించేందుకుగానూ ఆహ్వానసంఘం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ట్రాన్స్పోర్ట్, అకామిడేషన్ కమిటీలు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాయి. కాచిగూడ, ఆర్టీసీక్రాస్రోడ్డులోని హోటళ్లు, ఎస్వీకే, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, పలు ప్రజా సంఘాల కార్యాలయాల్లో ప్రతినిధులకు వసతి కల్పించారు.
చింతమడక నుంచి ఐదుగురు వాలంటీర్లు...
ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలో ప్రతినిధులకు సేవలు అందించేందుకుగానూ సీఎం కేసీఆర్ సొంత గ్రామం చింతమడక నుంచి ఐదుగురు విద్యార్థులు వచ్చారు. 'మహాసభలకు రెండు రోజుల ముందుగానే ఇక్కడికొచ్చాం. అన్ని రాష్ట్రాల ప్రతినిధులను కలిసి మాట్లాడటం, మహాసభల నిర్వహణను దగ్గర నుంచి చూసేందుకు అవకాశం లభించడం గర్వంగా ఉంది. ఆయా రాష్ట్రాల ప్రతినిధులతో, జాతీయ నాయకులతో అనుభూతులను పంచుకోవడం బాగుంది' అని సంతోశ్, భానుప్రసాద్, డి.సంతోశ్, హరీశ్ అని చెప్పారు.