Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యారంగాన్ని కాపాడుకుంటాం
- నినదించిన విద్యార్థిలోకం
- శాస్త్రీయ విద్యావిధానంతోనే దేశప్రగతి
- అందరికీ విద్య...ఉపాధి కోసం ఐక్య పోరాటం
- ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభ దిశానిర్దేశం
- క్షేత్రస్థాయి సమస్యలపై విద్యార్థులను కదిలించడమే లక్ష్యం
- మోడీ సర్కారు విధానాలపై సమరభేరి
- విద్యా ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణతో ప్రమాదం
- రైతాంగం స్ఫూర్తితో ఎన్ఈపీపై ఉద్యమం
- హైదరాబాద్‌లో ఎస్ఎఫ్ఐ మహాసభలు విజయవంతం
బొల్లె జగదీశ్వర్
హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో ఉన్న ఠాగూర్ ఆడిటోరియంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించిన భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) అఖిల భారత మహాసభలు జయప్రదమయ్యాయి. 634 మంది ప్రతినిధులు, 68 మంది కేంద్ర కమిటీ సభ్యులు, 20 మంది పరిశీలకులు కలిపి మొత్తం 722 మంది పాల్గొన్నారు. నాలుగు రోజులపాటు విద్యారంగ సమస్యలపై విస్తృతంగా చర్చించారు. చివరిరోజు శుక్రవారం నూతన కమిటీని ఏకగ్రీవంగా ప్రతినిధులు ఎన్నుకున్నారు. ఎస్ఎఫ్ఐ శ్రేణుల్లో ఈ మహాసభలు నూతనోత్తే జాన్ని నింపాయి. వివిధ రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఎలాంటి ఉద్యమాన్ని నిర్మించాలనే దానిపై భవిష్యత్ కార్యాచరణను రూపొం దించారు. విద్యారంగం, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు సామ్రాజ్యవాదం, మతోన్మాదం, మోడీ ప్రభుత్వం అనుసరి స్తున్న విధానాలపై 36 తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 'విశాల భారత దేశమంతటా ఎస్‌ఎఫ్‌ఐదే విజయబావుటా, ఇంక్విలాబ్ జిందాబాద్, ఎస్ఎఫ్ఐ జిందాబాద్, అప్ అప్ సోషలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం, జీనా హైతో మర్నా సీకో... కదం కదం పర్ లడ్నా సీకో, బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ముర్దాబాద్' అంటూ ప్రతినిధులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. శాస్త్రీయ విద్యావిధానంతోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని మహాసభ దిశానిర్దేశం చేసింది. కేరళలో అమలవుతున్న ప్రత్యామ్నాయ విద్యావిధానం దేశంలో అమలు చేయాలని కోరింది. అందరికీ విద్య... అందరికీ ఉపాధి కోసం ఐక్య పోరాటం చేయాలని పిలుపునిచ్చింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రీకరించి పనిచేయాలనీ, వారిని కదిలించి ఉద్యమించడమే లక్ష్యంగా నిర్దేశించుకోవాలని మహాసభ పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు రోజురోజుకు కునారిల్లు తున్నాయి. ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల సమస్యతో సతమతమవుతున్నాయి. వాటి పరిష్కారం కోసం ఉద్యమించాలని కోరింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా రంగంతో పాటు విద్యార్థి వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని నిర్ణయించింది.
ప్రశ్నించే వారిపై నిర్బంధం ప్రయోగిస్తున్నది. విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామిక విలువలను కాలరాస్తున్నది. ముఖ్యంగా రాష్ట్రాలను సంప్రదించకుండా ఏకపక్షంగా తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)-2020ని రద్దు చేయాలని కోరుతూ కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ఉద్యమించాలని పిలుపునిచ్చింది. అది అమలైతే విద్యారంగంలో అసమానతలు పెరుగుతాయనీ, డ్రాపౌట్ రేటు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పేద విద్యార్థులు, అమ్మాయిలు ఉన్నత చదువులకు దూరమవుతారని తెలిపింది. విద్యా ప్రయివేటీకరణ, వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణ అవుతుందంటూ ప్రకటించింది. మూఢవిశ్వాసాలను పెంచేలా, మనువాద, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఎన్ఈపీలో చేర్చింది. దానివల్ల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం కొరవడడంతోపాటు సృజనాత్మకంగా ఆలోచించే అవకాశం లేకుండా పోయే ప్రమాదమున్నది. అందుకే రైతాంగం స్ఫూర్తితో ఎన్ఈపీని వ్యతి రేకిస్తూ విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించాలని మహాసభ పిలుపు నిచ్చింది. ఈ అంశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
మొదటి రోజు నుంచి ఉత్సాహమే...
ఈనెల 13న ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలు హైదరాబాద్‌లోని ఓయూలో ప్రారంభమయ్యాయి. అదేరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి పీపుల్స్ ప్లాజా వరకు విద్యార్థుల ప్రదర్శన సాగింది. అనంతరం నిర్వహించిన బహిరంగసభకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ హాజరై విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. అదేరోజు సాయంత్రం ఆరు గంటలకు ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియం వద్ద ఎస్ఎఫ్ఐ జెండాను ఆ సంఘం అఖిల భారత అధ్యక్షులు విపి సాను ఆవిష్కరించారు. నాయకులు, ప్రతినిధులు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యఅతిధిగా హాజరైన మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కె చంద్రు మహాసభను ప్రారంభించారు. ఆ తర్వాత కార్యకలాపాలు, నిర్మాణ నివేదికను ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్ ప్రవేశపెట్టారు. రెండోరోజు ఈనెల 14న ఎస్ఎఫ్ఐ అఖిల భారత మాజీ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఎంఏ బేబీ, నీలోత్పల్ బసు, వై వెంకటేశ్వరరావుతో పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొని సౌహార్ధ సందేశమిచ్చారు. మూడోరోజు ఈనెల 15న వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు, బంగ్లాదేశ్, క్యూబా, పాలస్తీనా నుంచి విద్యార్థి సంఘాల నాయకులు హాజరై సందేశమిచ్చారు. వివిధ దేశాల నుంచి నాయకులు వీడియో సందేశాన్ని పంపారు. అయితే మొదటి రోజు నుంచే విద్యార్థులు, ప్రతినిధుల్లో ఉత్సాహం వచ్చింది. చివరిరోజు శుక్రవారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆ తర్వాత మహాసభలు ముగిశాయి.