Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్సిటీల్లో ప్రగతిశీల సంస్కృతి పెరగాలి
- ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి నితీష్ నారాయణన్
- ఒకే దేశం - ఒకే పరీక్ష అనేది విద్యార్థి వ్యతిరేక నిర్ణయం
- తెలంగాణలోనూ ద్వితీయశ్రేణి పౌరులుగా విద్యార్థులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యారంగ పరిరక్షణకు విశాల ప్రాతిపదికన అభ్యుదయ విద్యార్థి సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు చేపడతామని ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి నితీష్ నారాయణన్ తెలిపారు. అయితే క్షేత్ర స్థాయి పోరాటాలతోనే ఈ ఐక్యత సాధ్యమని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభ చివరి రోజైన శుక్రవారం ఆయన ఒయూలోని ఠాగూర్ ఆడిటోరియం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. నూతన జాతీయ విద్యా విధానానికి ప్రత్యామ్నాయ విద్యా విధాన ముసాయిదాపై మహాసభలో చర్చించినట్టు తెలిపారు. దీనిపై ఉపాధ్యాయులు, విద్యావేత్తలతో పాటు విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు, సమూహాలతో విస్తృతంగా చర్చించనున్నట్టు చెప్పారు. అందరితో సమాలోచనలు జరిపి అవసరమైన సవరణల అనంతరం తుది ముసాయిదాను కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించడంతో పాటు ప్రజల కోసం విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రతిభకు ఒక భాష గీటురాయి కాదనీ, పాఠశాల విద్య నుంచి ప్రొఫెషనల్ విద్య వరకు విద్యార్థి ఇష్టమైన భాషలో నేర్చుకునే వెసులుబాటు ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఒకే భాషలో విద్య అనే బీజేపీ విధానం సరైన విధానం కాదన్నారు. ఒకే దేశం - ఒకే పరీక్ష అనేది కూడా విద్యార్థి వ్యతిరేక నిర్ణయమేనని తెలిపారు. ఆయా రాష్ట్రాలు తమ విద్యార్థులకు అనువైన రీతిలో పరీక్షలు నిర్వహించుకునే స్వేచ్ఛ ఉండాలని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలల సంఖ్య తక్కువగా ఉందనీ, ఆ మాత్రం ఉన్న పాఠశాలల్లో డిజిటల్ సౌకర్యాలు అంతంతమాత్రమేనని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యాసంస్థల్లో ప్రజాస్వామ్య వాతావరణం కొరవడిందనీ, డ్రగ్స్ సంస్కతి పెరిగిపోయిదని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో డ్రగ్ మాఫీయా మరింత రెచ్చిపోయిందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థుల్లో ప్రగతీశీల సంస్కృతిని పెంపొందిస్తూ చైతన్యం తెచ్చిందన్నారు. ఈ క్రమంలో కేరళ రాష్ట్రం వయనాడ్ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి డ్రగ్ మాఫియా చేతిలో దాడికి గురైందని గుర్తుచేశారు. వికలాంగ విద్యార్థుల సౌకర్యాల కోసం ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని తెలిపారు.
విద్యార్థులు ద్వితీయ శ్రేణి పౌరులు కాదు....
విద్యార్థులను ద్వితీయ శ్రేణి పౌరులుగా తక్కువగా చూసే విధానం మానుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఎన్నికలపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఆ గవర్నర్లు....వర్సిటీల్లో సమస్యలకు సృష్టికర్తలు
కేరళ, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్ తదితర బీజేపీయేతర రాష్ట్రాల గవర్నర్లు యూనివర్సిటీల వ్యవహారాల్లో అనవసర జోక్యం చేసుకుంటున్నారని నితీష్ నారాయణన్ ఈ సందర్భంగా విమర్శించారు. సంఫ్‌ు పరివార్ పొలిటికల్ ఏజెంట్లుగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్లు ప్రజలతో ఎన్నికైన వారు కాదు..అందుకే వారికి రాచరిక మనస్థ్వత్వం ఉంటుందని విమర్శించారు.
697 మంది ప్రతినిధులు...
ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభల్లో 23 రాష్ట్రాల నుంచి 722 మంది ప్రతినిధులు, పరిశీలకులు పాల్గొన్నారని తెలిపారు. వీరిలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సిద్ధిపేటకు చెందిన 16 ఏండ్ల విద్యార్థినీ హారిక అందరిలోకెల్లా పిన్న వయస్కురాలని చెప్పారు.మహాసభ 36 తీర్మానాలను ఆమోదించిందని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి, టి.నాగరాజు, ఆహ్వాన సంఘం కోశాధికారి జావేద్, ప్రతినిధులు షేజిన, నిలంజన్ దత్త పాల్గొన్నారు.