Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పౌల్ట్రీ రేట్ తక్కువ.. మార్కెట్ ధర ఎక్కువ
- కోళ్ల మోర్టాలిటీ.. ఫీడ్ ధరల పెరుగుదలతో నష్టపోతున్న చిన్న రైతులు
- ఫారం రేట్లో రూ.4.90.. మార్కెట్ ధర రూ.7
- హౌల్‌సేల్, రిటైల్ చేతులు మారాకనే రూ.2 అదనం
- అంగన్వాడీ, హాస్టల్స్, ఆస్పత్రులపై తీవ్ర ప్రభావం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
కోడి గుడ్డు ధర కొండెక్కి వినియోగదారుడికి ప్రియమైంది. పౌల్ట్రీ రేట్ తక్కువ.. మార్కెట్ ధర ఎక్కువగా ఉంది. లేయర్ కోళ్ల మోర్టాలిటీ, ఫీడ్ ధరల పెరుగుదల వల్ల తాము నష్టపోతున్నామని పౌల్ట్రీ రైతులు పేర్కొంటున్నారు. మరో పక్క మార్కెట్లో గుడ్డు ధర పెరగడంతో వినియోగదారులకు భారంగా మారింది. ఇటు రైతులు, అటు వినియోగదారులూ నష్టపోతుండగా ఫీడ్ కంపెనీలు, గుడ్ల వ్యాపారులు మాత్రం లాభపడుతున్నారు. గుడ్డు ధర పెరగడంతో పౌష్టికాహారం తీసుకోవాల్సిన అంగన్వాడీ, హాస్టల్స్ విద్యార్థులు, ఆస్పత్రుల్లో రోగులపై తీవ్ర ప్రభావం పడుతోంది.
తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమకు పెట్టింది పేరుగా ఉంది. బాయిలర్, లేయర్ రెండు రకాల పౌల్ట్రీ ఫారాలు విస్తరించాయి. సిద్దిపేట, వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్, కరీంగనర్ వంటి ప్రాంతాల్లో లేయర్ పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ 3 కోట్ల మేరకు కోడి గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. అందులో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజూ సగటున 2 కోట్ల మేరకు కోడి గుడ్లను వినియోగిస్తున్నారు. వినియోగం పోగా మిగిలిన కోడిగుడ్లను మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, చత్తీస్గడ్, ఒడిశా వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇటీవల ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా పౌల్ట్రీ పరిశ్రమ విస్తరణ కోసం రాయితీలు ఇస్తున్నాయి. దాంతో లేయర్ పౌల్ట్రీలు పెరుగుతుండటంతో తెలంగాణ నుంచి ఎగుమతికి క్రమంగా డిమాండ్ తగ్గుతోంది.
మోర్టాలిటీ.. ఫీడ్ ధరల పెరుగుదల
లేయర్ పౌల్ట్రీ పరిశ్రమకు రెండు రకాల ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా స్థానికంగా 5లక్షల కోళ్లలోపు పెంపకం చేస్తున్న పౌల్ట్రీ యజమానులు తీవ్రంగా దెబ్బతింటున్నారు. పది లక్షలకు పైగా పెంచే పౌల్ట్రీల యజమానులు పెద్ద తలకాయలు కావడంతో ఇబ్బందులేమీ లేవంటున్నారు.
ఇటీవల ఏర్పడిన వాతావరణ మార్పులు, అధిక వర్షాల వల్ల మోర్టాలిటీ శాతం పెరిగింది. ఒక పౌల్ట్రీలో నాలుగు బ్యాచుల కోళ్ల పెంపకాన్ని పరిశీలిస్తే మొదట 40 శాతం, ఆ తర్వాత 60 శాతం ఇటీవల 80 శాతం వరకు మోర్టాలిటీ ఉండటంతో యజమానులు తీవ్రంగా నష్టపోయారు. దాంతో కోడి గుడ్ల ఉత్పత్తిపై కొంత ప్రభావం చూపింది. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంతో ఆ ప్రభావం కోళ్ల ధాణా పైన పడింది. ఏడాదిన్నర కిందట కోళ్ల దాణా ధర కిలోకు రూ.16 ఉండగా, ప్రస్తుతం రూ.25 అయ్యింది. గత నెలలో రూ.28 వరకు పెరిగిందని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. రెండు విధాల నష్టమేర్పడటంతో రైతులు ఫారాల్ని మూసేయడం, లీజ్‌కు ఇవ్వడం జరుగుతోందని అంటున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు మాత్రం మార్కెట్ హెచ్చుతగ్గుల్ని భరిస్తూ నడుపుతున్నారు. పౌల్ట్రీలో కోళ్ల ధాణ, పెంపకం ఖర్చులు కలిపి ఒక కోడి గుడ్డు ఉత్పత్తికి రూ.4.20 ఖర్చు అవుతోంది. కనీసం ఒక గుడ్డు ధర రూ.4.50 పలికితే పౌల్ట్రీ యజమానులకు నష్టముండదంటున్నారు. రెండు నెలలుగా రూ.4.50 నుంచి రూ.5 వరకు ధర వస్తుండడంతో నష్టాలుండట్లేదని పలువురు యజమానులు పేర్కొంటున్నారు.
ఫారం రేట్ తక్కువ.. మార్కెట్ ధర ఎక్కువ
ప్రస్తుతం మార్కెట్లో కోడి గుడ్ల ధరలు మండిపోతున్నాయి. వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే... శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని పలు లేయర్ పౌల్ట్రీ ఫారాల గేట్ వద్ద ఒక గుడ్డు ధర రూ.4.90 పలికింది. గంప శ్రీనివాస్ పౌల్ట్రీ వద్ద 2 లక్షల గుడ్ల విక్రయాలు జరిగాయి. కోడి మాంసం, గుడ్ల మార్కెట్ సగటును
పరిశీలించే నెక్లో 100 గుడ్ల ధర రూ.524 ఉంది. అదే విధంగా బాపక్లో టేబుల్లో వంద గుడ్ల ధర రూ.490 ఉంది. ప్రస్తుతం ఫారం గేట్ వద్ద ఒక గుడ్డు ధర రూ.4.90 నుంచి రూ.5 వరకు ఉంటు ంది. అదే మార్కెట్లోని దుకాణాల్లో మాత్రం డజన్ చొప్పున తీసుకుంటే ఒక గుడ్డుకు రూ.6.50 పడుతు ండగా విడిగా తీసుకుంటే ఒక గుడ్డు ధర రూ.7 ఉంది. అంటే ఫారం గేట్ వద్ద ఉన్న ధరకు మార్కెట్ లో హౌల్‌సేల్, రిటేల్ వ్యాపారుల చేతులు మారాక వినియోగదారుడి వద్దకొచ్చే సరికి అదనం గా ఒక గుడ్డుపై రూ.2 పెరుగుతోంది. ఉత్పత్తి దారులకు ఒక గుడ్డు ఉత్పత్తికి అయ్యే ఖర్చు పోగా పావలా మిగులుతుండగా హౌల్‌సేల్, రిటేల్ వ్యాపారులకు మాత్రం చెరో రూపాయి చొప్పున లాభం పొందుతున్నారు. రెండు నెలల కిందట ఒక గుడ్డు ధర రూ.5 ఉండేది. ఆ తర్వాత రూ.6 అయ్యింది. తాజాగా రూ.7 ధర ఉండటంతో రోజువారీ వినియోగంపై తీవ్ర ప్రభావం చూపి సామాన్యులు
పౌష్టికాహారానికి దూరమవుతున్నారు.
అంగన్వాడీ, హాస్టల్స్, ఆస్పత్రులపై ప్రభావం
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, బాలింతలు, గర్భిణుల పౌష్టికాహారం కోసం రోజూ కోడిగుడ్లను ఇస్తారు. గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్‌లో వారంలో మూడు రోజుల పాటు గుడ్డు పెడతారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్పేషంట్లకు రోజుకు రెండు ఉడకబెట్టి న కోడి గుడ్లను ఇస్తారు. ధరలు పెరగడంతో వీరికి పౌష్టికాహారమైన కోడిగుడ్డు అందని ద్రాక్ష కాబోతుం ది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 3730 అంగన్వాడీ కేంద్రాల్లో 20 లక్షల మంది పిల్లలున్నారు. వెయ్యి మంది వరకు బాలింతలు, గర్భిణులు నమోదయ్యార ని అధికారులు చెబుతున్నారు. వీరందరికీ గుడ్లు తగ్గించే పరిస్థితి ఉంది. సదరు కాంట్రాక్టర్లు ఇప్పటికే గుడ్ల సరఫరాను తగ్గించారని అంగన్వాడీ టీచర్లు చెబుతున్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కలిపి 201 సంక్షేమ హాస్టళ్లుండగా వాటిల్లో 23 వేల మంది విద్యార్థులున్నారు. గురుకులాల్లోనూ మరో 15 వేల మంది విద్యార్థులకు రెండు రోజులకోసారి ఇచ్చే గుడ్డును తగ్గించనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రులతో పాటు మూడు జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్లకు రోజుకు రెండు కోడిగుడ్లు పెట్టాలి. ధరల వల్ల కాంట్రాక్టర్ ఒకటే ఇస్తున్నారంటున్నారు.
పౌల్ట్రీ వద్ద రూ.4.90 ఉంది: గంప శ్రీనివాస్, లేయర్ పౌల్ట్రీ యజమాని, సిద్దిపేట
శుక్రవారం పౌల్ట్రీ వద్ద ఒక గుడ్డు ధర రూ.4.90 పలికింది. మార్కెట్లో రూ.6.50 నుంచి రూ.7లకు అమ్ముతున్నారు. ధాణా ధరలు పెరగడం, కోళ్ల మోర్టాలిటీ శాతం పెరగడం వల్ల ఇటీవల పౌల్ట్రీ పరిశ్రమ భారంగా మారింది. చిన్న రైతులు మూసేస్తున్నారు. కొందరు లీజుకిచ్చారు. మార్కెట్లో గుడ్డు ధర ఎక్కువగా ఉన్నది వాస్తవమే. కానీ..! ఒక గుడ్డు ఉత్పత్తి వ్యయం పెరిగినందున మాకు పెద్దగా లాభాలేమీ రావట్లేదు. ఈ రెండు నెలలుగా మంచి ధరే వస్తుంది. చిన్నచిన్న పౌల్ట్రీలను కాపాడాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.
గణనీయంగా పడిపోతున్న గుడ్డు వినియోగం
పౌష్టికాహారమైన కోడి గుడ్డును సంపన్నులే కాదు సామాన్యుల ఇండ్లలో కూడా నిత్యం వినియోగిస్తారు. పిల్లలు, అనారోగ్యం పాలైన వాళ్లకు విధిగా పెడుతుంటారు. రోజువారి కోడిగుడ్ల విక్రయాలు గణనీయంగా పడిపోయాయని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. ఎగ్ప్రైయిడ్రైస్, ఎగ్బజ్జి, ఎగ్బొండా, ఎగ్‌కర్రీ, ఎగ్‌పఫ్, ఆమ్లేట్, బాయిల్డ్ ఎగ్ వంటి అమ్మకాలు తగ్గడం వల్ల వ్యాపారాలు నడుస్తులేవని పలువురు వాపోతున్నారు. రూ.10లకు రెండు కోడిగుడ్లు వచ్చేది పోయి ప్రస్తుతం ఒకటే వస్తున్నందున రోజువారీ వినియోగం కూడా రెండు గుడ్లకు బదులు ఒకటే వాడుతున్నట్టు నాగమణీ అనే గృహిణి తెలిపారు.