Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్కాలర్షిప్లు రద్దు చేసి కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోడీ
- ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యావ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ విమర్శించారు. విద్యార్థుల స్కాలర్షిప్లను రద్దు చేసి కార్పొరేట్ సంస్థలకు మోడీ ప్రభుత్వం దోచిపెడుతున్నదని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఉన్నత విద్యా సంస్థలను కేటాయించడం లేదని విమర్శించారు. అయినా కేంద్రం తీరుపై బీజేపీ రాష్ట్ర ఎంపీలు మాట్లాడకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయ కుండా నిర్లక్ష్యం వహించడం లేదని పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడమేనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ను ఏర్పాటు చేయాలనీ, త్రిపుల్ఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థలను మంజూరు చేయాలని కోరారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను ఏకం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.