Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోళ్లు, డిస్ట్రిబ్యూషన్, జనరేషన్ ట్రూ-అప్ బాదుడు
- విచారణ తర్వాత నిర్ణయం-టీఎస్ఈఆర్సీ చైర్మెన్ టీ శ్రీరంగారావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మరోసారి కరెంటు చార్జీలు పెరగనున్నాయి. ట్రూ-అప్ల పేరుతో దాదాపు రూ.17వేల కోట్లకు పైగా భారాలు ఈసారి ప్రజలపై పడనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో టారిఫ్ పెంపుదల వల్ల విద్యుత్ వినియోగదారులపై పడిన రూ.5,986 కోట్లకు ఈ రూ.17వేల కోట్లు అదనం. ఇప్పటికే వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్ఎస్ఏ) పేరుతో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) అనుమతి అవసరం లేకుండా యూనిట్‌కు 30 పైసలు చొప్పున చార్జీలు పెంచుకొనేలా టీఎస్ఈఆర్సీ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ భారం 2023 మే నెలలో విద్యుత్ వినియోగ దారులకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రూ.17వేల భారాల్లో కొన్ని ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా ప్రజలపై పడను న్నాయి. 2006-07 ఆర్ధిక సంవత్సరం నుంచి 2020-21 వరకు 14 ఏండ్లకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ట్రూ-అప్ పేరుతో రూ.4,092 కోట్ల భారానికి సంబంధించిన ప్రతిపాదనల్ని డిస్కంలు టీఎస్ఈఆర్సీకి సమర్పించాయి. వీటిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే మరోసారి 2016-17 నుంచి 2022-23 వరకు విద్యుత్ కొనుగోళ్ళ ట్రూ-అప్ పేరుతో రూ.12,015 కోట్లు వసూలు చేసుకోవ డానికి అనుమతి ఇమ్మంటూ మళ్లీ డిస్కంలు టీఎస్ఈఆర్సీలో పిటీషన్లు దాఖలు చేశాయి. వీటిపై జనవరి 18వ తేదీ బహిరంగ విచారణ జరుపుతామని టీఎస్ఈఆర్సీ చైర్మెన్ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు (టెక్నికల్) మనోహరరాజు తెలిపారు. ఇవి కాకుండా 2023-24 తొలి ఆరు నెలల కాలానికి (ఏప్రిల్1 నుంచి సెప్టెంబర్ 30 వరకు) ఓపెన్ యాక్సెస్ వినియోగదారుల నుంచి అదనపు సర్‌చార్జి వసూలు కోసం డిస్కంలు మరో పిటీషన్ కూడా దాఖలు చేశాయి. మరోవైపు టీఎస్ జెన్కో రూ.369.56 కోట్లు, సింగరేణి కాలరీస్ రూ.338.13 కోట్ల మేర ట్రూ-అప్ చార్జీలు వసూలు చేసుకొనేలా అనుమతించాలని టీఎస్ఈఆర్సీలో పిటీషన్లు దాఖలు చేశాయి. ప్రభుత్వ శాఖల కరెంటు బకాయిలు మొత్తంగా రూ.20,841 కోట్లు ఉన్నాయని ఈఆర్సీ చైర్మెన్ తెలిపారు.